మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమేంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తాయి. పరుచూరి గోపాలకృష్ణ తాజాగా భోళా శంకర్ మూవీ గురించి విశ్లేషించడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
భోళా శంకర్ మూవీ అన్నాచెలెళ్ల కథ కాదని చెల్లెలు కాని అమ్మాయిని చెల్లిగా భావించి చేరదీసిన అన్న కథ అని ఆయన చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ మూవీ పాయింట్ అద్భుతమైన పాయింట్ అని (Paruchuri Gopalakrishna ) పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. భోళా శంకర్ మాతృక వేదాళంకు ప్రేక్షకాదరణ బాగా దక్కిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోల్ కతా బ్యాగ్రౌండ్ లో తెరకెక్కిన సినిమాలపై ప్రాంతీయత ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. నేటివిటీకి సంబంధించిన సినిమా కాదని అనిపిస్తే ఆ సినిమా కనెక్ట్ కాదని పరుచూరి తెలిపారు.
ఈ సినిమా కథను కోల్ కతా కథలా చూపించడంతో ఈ కథ మన కథ కాదనే భావన కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రెండు పడవల ప్రయాణం చేశారా అని అనిపించిందని పరుచూరి కామెంట్లు చేశారు. ఈ సినిమాలో చిరంజీవిని తమన్నా ద్వేషిస్తూ ఉంటుందని ఆయన అన్నారు. సెకండాఫ్ లో చిరంజీవిని నెగిటివ్ గా చూపించడం మైనస్ అయిందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
భోళా శంకర్ కథను తిప్పి చూపించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. యథాతథంగా కథను నడిపించి ఉంటే ఈ సినిమా బెటర్ గా ఆడేదని పరుచూరి కామెంట్లు చేశారు. పరుచూరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరుచూరి కామెంట్లతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు. చిరంజీవి తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.