జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాకు హాజరయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భార్య అన్నా లెజ్నెవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం చేశారు. పవన్ రాకతో అక్కడి భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడగా, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
కుంభమేళా సందర్భంగా భారీగా భక్తులు తరలి వస్తుండటంతో, ఆయన స్నానం పూర్తయ్యే వరకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఏపీలో వీఐపీలు కుంభమేళాకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ దంపతులు అక్కడ పుణ్యస్నానం నిర్వహించగా, ఇప్పుడు పవన్ కుటుంబ సమేతంగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మెడలో జంధ్యం వేసుకుని, సంప్రదాయ దుస్తుల్లో కుంభస్నానం చేయడం భక్తుల్ని ఆకర్షించింది.
పవన్‌తో పాటు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ యాత్రలో పాల్గొనడం గమనార్హం. సినిమా, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. ఆలయ సందర్శనలతో పాటు కుంభమేళాకు హాజరవడంతో పవన్ హిందుత్వ రాజకీయం పట్ల ఆసక్తిగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన రాక సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు.
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం పవన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పవన్ క్రేజ్ పెరుగుతోందని సూచిస్తున్నాయి. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే, ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 28న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ‘ఓజీ’ సినిమా బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఏ రా ఏ టార’ గ్లింప్స్ అభిమానులను ఉత్సాహపరిచింది. మరోవైపు అకీరా నందన్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఆకీరా కాస్తా హాట్ టాపిక్‌గా మారాడు. మరి పవన్ రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.