‘హరిహర వీరమల్లు’ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ తో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా ముందుకు పెట్టారు. ఇందులో చిత్ర బృందం గురించి ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నిర్మాత ఏ.ఎం.రత్నం గారి కోసమే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. పొలిటికల్ గా నా ప్రత్యర్థులు నన్ను దారుణంగా తిడుతున్నప్పటికీ.. ఆయన కోసమే నా పనులన్నీ పక్కన పెట్టి ఈ సినిమా కోసం ఇక్కడ ఉండటం జరిగింది. సినిమా బ్రతకాలి.. నిర్మాతలు కనుమరుగైపోతున్న రోజులు ఇవి. ఒక సినిమా తీయడమే ఇప్పుడు ఓ యుద్ధం లాంటిది. సినిమా బాగుంటే జనాలు చూస్తారు.
బాగోకపోతే ఏం చేసినా.. ఎంత చెప్పినా చూడరు. రీజనల్ సినిమాని పాన్ ఇండియా స్థాయికి అంటే జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత ఏ.ఎం.రత్నం. ఫిలిం ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి కూడా..! అలాంటి వ్యక్తి నా ‘హరిహర వీరమల్లు’ వంటి గొప్ప సినిమాని తీసి కూడా జనాల్లోకి తీసుకెళ్లడానికి, రిలీజ్ చేయడానికి నలిగిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను.పోనీ ఆయన ఏమైనా గట్టిగా నాతో మాట్లాడతారా అంటే లేదు. ఓ పక్క బయ్యర్స్ కి, మరోపక్క ఫైనాన్షియర్స్ కి మధ్య నలిగిపోతూ కూడా మౌనం వహిస్తారు. ఆ మౌనమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఇలాంటి టైంలో హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ.. ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ ను తమ భుజంపై వేసుకున్నారు.
వారిని తప్పకుండా అభినందించాలి. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా నిధిలా ప్రమోట్ చేయడం నేను చూడలేదు. అలాగే దర్శకులు క్రిష్ చాలా గొప్ప ఐడియాతో నా ముందుకు వచ్చారు. కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇబ్బందుల కారణంగా ఆయన ఈ ప్రాజెక్టు నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆయన ఐడియా చాలా గొప్పది. ఈ సినిమా కోసం ఉన్నన్ని రోజులు ఆయన చాలా కష్టపడి పనిచేశారు. జ్యోతి కృష్ణ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. క్లైమాక్స్ కోసం 57 రోజుల పాటు శ్రమించారు. నేను కూడా ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది.మిగిలిన హీరోల మార్కెట్ కంటే నాది చిన్న మార్కెట్టే. నా సినిమాని కొనడానికి బయ్యర్స్ ఆలోచించి ఉండొచ్చు. కానీ కచ్చితంగా ఈ సినిమా మంచి హై ఇస్తుంది. ఓ ఎనర్జీతో ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వస్తారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తారు.