‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో లేటు వయసులో ఘాటు రికార్డు అందుకున్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్ (Venkatesh). రూ.వంద కోట్ల సినిమా కోసం కొంతమంది స్టార్లు చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంటే వెంకీ ఏకంగా రూ.300 కోట్లు వసూళ్లు అందుకున్నారు. దీంతో ఆయన నెక్స్ట్‌సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానం ఇప్పుడు దొరికింది అనిపిస్తోంది. మరో స్టార్ హీరో డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం కారణంగా స్టార్ దర్శకుడు వెంకటేశ్‌ను కాంటాక్ట్ అయ్యారు అని సమాచారం వస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్ రావొచ్చు అంటున్నారు. వెంకటేశ్ కొత్త సినిమా కోసం చాలామంది దర్శకులు ఆయన్ను కాంటాక్ట్ అవుతున్నారు. అందులో ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమా రచయితల్లో ఒకరు కొన్ని నెలల క్రితం కథ చెప్పారు. ఆ మధ్య తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) పేరు వినిపించింది. ఆ తర్వాత అనుదీప్ (Anudeep Kv) పేరు కూడా చర్చలోకి వచ్చింది. అయితే అవేవీ ఓకే అవ్వలేదు. ఒకరిద్దరు సీనియర్ దర్శకుల పేర్లు కూడా చర్చలోకి వచ్చాయి.
ఇప్పుడు కొత్త పేరుగా హరీశ్ శంకర్ వచ్చారు. ఇటీవల వెంకటేశ్‌కి హరీశ్ (Harish Shankar) ఓ లైన్ చెప్పారట. ఇద్దరి స్ట్రాంగ్ జోన్ అయినా కామెడీ బేస్ చేసుకునే ఆ కథ ఉందట. సురేశ్ బాబు నుండి అంగీకారం వస్తే అనౌన్స్ చేసేస్తారు అని అంటున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా రీస్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉండటంతో హరీశ్ శంకర్ ఈ లోపు వెంకటేశ్‌తో సినిమా చేసేద్దాం అనుకుంటున్నారని సమాచారం.
ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా పనులు అయిపోయాక పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG) సినిమా పనులు స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాతే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఉంటుంది. అందుకే వెంకీతో ఓ సినిమా చేసేసే ఆలోచన. మరి ఈ సినిమా కొత్తదా, లేక రీమేక్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే రామ్ (Ram), బాలకృష్ణకు (Nandamuri Balakrishna) హరీశ్ శంకర్ ఓ కథ నెరేషన్ ఇచ్చారు. కానీ అవి ఓకే అవ్వలేదని సమాచారం.