కుర్రాడిగా ఉన్నప్పుడు మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఏదో చేద్దామని ఏదో చేసి, ఒక్కోసారి ఏదీ చేయలేక యువత మనసులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈ క్రమంలో కొంతమంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తాయి. ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి ఇబ్బందే పడ్డారు. ఏకంగా ప్రాణం తీసుకుందామనే ఆలోచనకు కూడా వచ్చారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే చెప్పారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోకి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. తొలి ఎపిసోడ్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో.. రెండో ఎపిసోడ్ గురించి చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లుగా రెండో ఎపిసోడ్ భలే వెరైటీగా, ఇంట్రెస్టింగ్‌గా వచ్చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులో పవన్ ఆలోచన విధానం, అప్పుడేమైంది అనే విషయాలను చెప్పారు.
చిన్నప్పటి నుండి పవన్ కల్యాణ్‌కు ఆస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో తరచుగా ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండేది. మరోవైపు స్నేహితుల్లేక ఎప్పుడూ ఇంటిలోనే ఉండేవాడట. దీంతో పుస్తకాలే స్నేహితులుగా ఉండేవాడట పవన్. ఈ క్రమంలో స్కూలు, కాలేజీకి వెళ్లడం ఇబ్బందిగా అనిపించేదట. దీంతో పరీక్షలంటే ఒత్తిడిగా అనిపించేదట. అంతేకాదు టీచర్లూ, లెక్చరర్లు కూడా నచ్చేవాళ్లు కాదట. ఆ సమయంలో పవన్ స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తుండేవారట. దీంతో పరీక్షల్లో పాస్ అవ్వలేనేమో అనే ఆలోచనలు పవన్ మైండ్‌ను తినేసేవట.
సుమారు 17 ఏళ్ల వయసులో పవన్ మానసికంగా చాలా కుంగిపోయారట. ఒకానొక సమయంలో చనిపోతే బాగుండు అనిపించిందట. దీంతో ఓ రోజు చిరంజీవి లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామనుకున్నాడట పవన్. అయితే విషయం సురేఖ, నాగబాబు గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారట. నన్ను నేను తుపాకీతో కాల్చుకుందామనుకుంటున్నా అని చెప్పడంతో.. పవన్‌ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారట. పరీక్షలపై దిగులుతో అలా ఉన్నానని పవన్ అనడంతో.. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారట చిరు. అన్న మాట విని.. ఇప్పుడు పవన్ ఎదిగి పవర్ స్టార్ అయ్యి.. ఆ తరవాత జనసేనాని అయ్యాడు.