Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ
- January 22, 2026 / 01:19 PM ISTByPhani Kumar
సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది కూడా. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకి నుండి ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా మంచి అప్రీషియేషన్ అందుతుంది. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీంని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పై ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీంని పొగుడుతూ ఓ లెటర్ రిలీజ్ చేశారు.
Mana ShankaraVaraprasad Garu
“మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.4 దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా నిలుస్తూ.. అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారు. ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని అందించిన ఆయన ప్రతిభ ప్రశంసనీయమైనది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే తెరపై కలిసి కనిపించడం ప్రేక్షకులకు నిజంగా అపూర్వ ఆనందాన్ని కలిగించింది.సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో గారు అందించిన అద్భుతమైన సంగీతం, సినిమాకు మరింత శక్తిని జోడించింది.
ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యే చిత్రాన్ని అందించిన నిర్మాతలు సాహు గారపాటి గారు, సుష్మిత గారికి కూడా ప్రత్యేక అభినందనలు.ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగమైన నయనతార గారు, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు చిత్ర బృందం మొత్తానికి శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.














