బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఇండో – యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డును పవన్‌కళ్యాణ్ రెండు రోజుల క్రితం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు అందుకున్న అనంతరం అక్కడి అంబేద్కర్ మెమోరియల్‌ను సందర్శించినపుడు “శ్రీ బాబా సాహెబ్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు. మా జాతికే గర్వకారణమైన గొప్ప నేత.. ఆయన్ను నేను నిజంగా ఆరాధిస్తాను.. ఆయన్నుంచి ప్రేరణ పొందాను. జనసేన పార్టీ ద్వారా నా తుది శ్వాస వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉంటాను.” అంటూ పవన్ ఆటోగ్రాఫ్ చేశారు.
ఇది నిన్న వైరల్ అయింది. తాజాగా అక్కడి విద్యార్థులతో పవన్ కులం ప్రస్తావన తీసుకురావడం నేడు సంచలనం అయింది. ” నేను కుల రాజకీయాలకు వ్యతిరేకం, కుల ప్రాతిపదికన ఎవరు మద్దతిచ్చినా తీసుకునేది లేదు” అని స్పష్టం చేసినట్లు తెలిసింది. “నేను ఏ కులంలో పుట్టినా, నాకు మాత్రం క్రిస్టియన్ పాప పుట్టింది. కులం అనేది మన ఛాయిస్ కానప్పుడు, ఆ కులానికి మనమెందుకు ప్రయారిటీ ఇవ్వాలి” అంటూ సూటిగా ప్రశ్నించారు. లండన్ లోని ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్’ నిర్వహించిన ‘యువ సమ్మేళనం’ లో చూపిన మాటలు యువతని ఆకట్టుకున్నాయి.
అలాగే “మీ దృష్టిలో మానవత్వం అంటే ఏంటి’ అని ఓ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “కుల, వర్ణ, ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలూ లేకుండా సమభావం పాటించడమే మానవత్వం” అని వివరించారు. అంతేకాదు మానవత్వమే తన కులం అని చెప్పి చప్పట్లు అందుకున్నారు. కులం అండ లేకుండా కుర్చీలో కూర్చోవడం కష్టమవుతున్న ఈ సమయంలో కులం ప్రస్తావన తీసుకురాకుండా ఎన్నికల్లో పోటీచేయనున్న పవన్ గురించి రాజకీయనాయకులు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.