బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తకరూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకానికి ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నన్సీ బైబిల్’ అనే టైటిల్ ని పెట్టింది. దీంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనా బుక్ టైటిల్ ను వ్యతిరేకిస్తూ శివాజీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. కరీనాతో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు.
అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జని, బుక్ పబ్లిషర్ సంస్థ జాగ్గర్ నట్ బుక్‌పై కూడా ఫిర్యాదు చేసినట్లు శివాజీ నగర్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ తెలిపారు. కరీనా కపూర్ బుక్ టైటిల్ క్రిస్టియన్ ల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ను అవమానించేలా ఉందని, ఇది క్రిస్టియన్ మనోభవాలను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై అధికారులు కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదట. ఇది ముంబై పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ పరిధిలోకి రాదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కరీనా రాసిన ఈ బుక్ ను జూలై 9న విడుదల చేశారు. ఈ పుస్తకం ప్రమోషన్స్ కోసం కరీనా బాగానే కష్టపడింది. ఇటీవలే ఆమె తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది.