2025లోనూ మలయాళ సినిమా తన సత్తాను ఘనంగా చాటుకొంటుంది. 2025లో ఇప్పటికే “రేఖా చిత్రం, ఐడెంటిటీ, డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్, ప్రవీణ్ కొడు షప్పు” వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా.. తాజాగా “పోన్ మ్యాన్” (Ponman) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. బాసిల్ జోసెఫ్, లిజోమోల్ జోస్, సాజిన్ గోపు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జోతిష్ శంకర్ దర్శకుడు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రాన్ని కాస్త లేటుగా చూడడం జరిగింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను అంతలా ఏం మ్యాజిక్ చేసింది? అసలు సినిమా కంటెంట్ ఏంటి? అనేది చూద్దాం..!!
Ponman Review
కథ: చెల్లెలు స్టెఫీ (లిజోమోల్ జోస్) పెళ్లి కోసం అజీష్ (బాసిల్ జోసెఫ్) దగ్గర 25 సవర్ల బంగారం అద్దెకు తీసుకుంటారు బ్రూనో (ఆనంద్ మన్మథన్) మరియు అతని తల్లి. పెళ్లికి వచ్చిన చదివింపుల సొమ్ముతో ఆ బంగారం తాలూకు డబ్బులు తిరిగి ఇచ్చేద్దామనుకుంటారు. అయితే.. బ్రూనో చర్చ్ కి సంబంధించిన వ్యక్తితో పెట్టుకున్న గొడవ కారణంగా.. పార్టీ నుండి కానీ, చర్చ్ నుండి కానీ ఎవరు హాజరవ్వరు. ఆ కారణంగా 25 సవర్ల బంగారం కొనుగోలుకు డబ్బు సెట్ అవ్వదు.
దాంతో.. అజీష్ తనకు 12 సవర్ల బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని పట్టుబడతాడు. అయితే.. స్టెఫీని పెళ్లి చేసుకున్న మరియానో (సాజిన్ గోపు)ను ఎదిరించి ఆ బంగారాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మరి అజీష్ ఏం చేశాడు? మారియానోను ఎలా ఎదిరించాడు? తనకు రావాల్సిన బంగారాన్ని ఎలా రాబట్టుకున్నాడు? అనేది “పోన్ మ్యాన్” కథాంశం.
నటీనటుల పనితీరు: బాసిల్ జోసెఫ్ ప్రతి సినిమాతో నటుడిగా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన బాసిల్.. తన క్యారెక్టర్ లో జీవించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ సగటు మధ్యతరగతి వ్యక్తిగా బాసిల్ నటనకు, పాత్రకు చాలా మంది కనెక్ట్ అవుతారు.
లిజోమోల్ జోస్ పాత్రకు డైలాగ్స్ తక్కువైనా.. చిన్నపాటి ఎక్స్ ప్రెషన్స్ తోనే చాలా సన్నివేశాలను పండించింది. వ్యక్తి పూజ కారణంగా తన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన యువకుడి పాత్రలో దీపక్ పరంబోల్ నటన ఓ కనువిప్పు. “ఆవేశం” ఫేమ్ సాజిన్ గోపు పోషించిన సగటు మిడిల్ క్లాస్ భర్త పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని అద్భుతంగా పండించాడు సాజిన్.
స్నేహితుడి పాత్రలో ఆనంద్ మన్మథన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాకపోతే.. మార్కండేయ అని క్యారెక్టర్ పేరు ఉన్న క్యారెక్టర్ తో జీసస్ వేషం వేయించి, శిలువ మోయించడం అనేది చిన్నపాటి హల్ చల్ చేసే విషయం.
సాంకేతికవర్గం పనితీరు: సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ డ్రామాను చక్కగా ఎలివేట్ చేసింది. కుటుంబ పరిస్థితులు మరియు పాత్రల తీరుతెన్నులు బట్టి లైటింగ్ & కలర్ టోన్ మారడం అనేది సినిమాటోగ్రాఫర్ గా కథను, పాత్రలను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అనేందుకు ప్రతీక. జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతంతో ఎమోషన్స్ ను భలే ఎలివేట్ చేసాడు. అన్నీ ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల సినిమాకి మరింత సహజత్వం వచ్చింది.
దర్శకుడు జోతిష్ శంకర్ కథగా ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. నిజానికి ఈ కథతో సినిమాను మలయాళం ఫిలిం మేకర్స్ మాత్రమే తీయగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి పాత్రతో ఒక నీతి కథ చెప్పాడు జోతిష్ శంకర్. తల్లి పాత్రతో మధ్యతరగతి మహిళల మనస్తత్వాన్ని, బ్రూనో క్యారెక్టర్ తో ఒకరు చేసే తప్పు కుటుంబానికి ఎలా శాపంగా మారుతుంది అని, ఆడపిల్లలు ఇష్టం లేకపోయినా కేవలం కుటుంబం కోసం తల వంచి పెళ్లి చేసుకుని ఎన్ని ఇబ్బందులు పడతారు అని స్టెఫీ పాత్రతో, ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడాలి కానీ..
సమస్య నుంచి తప్పించుకోవడం సరైన జీవన విధానం కాదని అజీష్ పాత్రతో.. ఇలా చాలా విషయాలని స్పష్టంగా వివరించుకొచ్చాడు. ముఖ్యంగా.. బాసిల్ & సాజిన్ మధ్య జరిగే చిన్నపాటి పోరాట సన్నివేశంలో శరీర సౌష్టవానికి, సంకల్ప బలానికి మధ్య ఉన్న తేడాను భలే పండించాడు. ఒక రచయితగా, దర్శకుడిగా “పోన్ మ్యాన్”తో వందశాతం విజయం సాధించాడు జోతిష్ శంకర్. ఇవన్నీ కూడా ఎలాంటి కమర్షియల్ హంగులకు తలొగ్గకుండా చేయగలగడం, 127 నిమిషాలపాటు ప్రేక్షకుల్ని థియేటర్లలో కదలనివ్వకుండా కూర్చోబెట్టడం అనేది ప్రశంసించాల్సిన విషయం.
విశ్లేషణ: డ్రామాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అందులో “పోన్ మ్యాన్” ఒకటి. బాసిఫ్ జోసెఫ్ అద్భుతమైన నటన, జోతిష్ శంకర్ పాత్రలను, కథనాన్ని నడిపించిన విధానం, సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ వర్క్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.
ఫోకస్ పాయింట్: అద్భుతమైన డ్రామా పండిన బంగారం లాంటి సినిమా!
రేటింగ్: 3.5/5
Rating
3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus