మన దగ్గర బుట్టబొమ్మ అంటూ గ్లామర్ పాత్రలకు ఓటేసిన పూజా హెగ్డే (Pooja Hegde).. ఇప్పుడు తమిళ సినిమాకు వెళ్లి ప్రయోగాలకు ముందుకొస్తోంది. అంటే ఇక్కడ అలాంటి పాత్రలు రాలేదా? వస్తే చేయలేదా అనేది మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు అయితే కోలీవుడ్‌లో చేస్తున్న వరుస సినిమాల్లో ప్రయోగాత్మక పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్ర కోసం ఆమె రామ్‌చరణ్‌ను ఫాలో అవుతోంది. ఇదంతా లారెన్స్ ఫేవరెట్ సినిమాల సిరీస్ కోసం. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో పూజా హెగ్డే హవా కనిపిస్తోంది.
సూర్యతో (Suriya) నటించిన ‘రెట్రో’ (Retro) సినిమా మే నెలలో విడుదల చేస్తున్నారు. ఇక విజయ్‌తో (Vijay Thalapathy) చేస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా దసరాకు వస్తుంది అని చెబుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్ర కాస్త కమర్షియల్ ఫార్మాట్‌కి దగ్గరగానే ఉంటుంది. వీటితో పాటు రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. అయితే లారెన్స్‌తో చేస్తున్న ‘కాంచన 4’ డిఫరెంట్‌గా ఉండబోతోందట. ‘కాంచన 4’ సినిమా లారెన్స్ (Raghava Lawrence) ఫేవరెట్ సిరీస్ కావడం గమనార్హం.
ఇందులో హీరోయిన్ల పాత్రలకు కూడా మంచి స్థానమే ఉంటుంది. అలా ఇప్పుడు పూజా హెగ్డేకు కూడా పవర్ ఫుల్ రోల్ ఇచ్చారు అని చెబుతున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో పూజా హెగ్డే సవాలుతో కూడిన పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఆమె బధిర యువతిగా కనిపించనున్నట్లు సమాచారం. డీగ్లామర్ లుక్‌లో కనిపిస్తుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో పూజతోపాటు నోరా ఫతేహి మరో నాయికగా నటిస్తోంది.
తెలుగులో తొలి సినిమా ‘ముకుంద’లో (Mukunda) గ్లామర్‌కి దూరంగా కనిపించిన పూజా హెగ్డే ఆ తర్వాత చాలావరకు గ్లామర్ రోల్సే చేసింది. ఇప్పుడు తమిళంలో తొలిసారి నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తోంది. పైన రామ్‌చరణ్‌ని (Ram Charan) అనుసరిస్తోంది అన్నాం కదా అదేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ‘రంగస్థలం’లో (Rangasthalam) ఆయన బధిరుడుగా కనిపించిన విషయం తెలిసిందే.