వరుస ప్రమాదాలు, మరణాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే..కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్, హాలీవుడ్ ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్, ‘హ్యారీ పోటర్’ ఫేమ్ పాల్ గ్రాంట్, కోలీవుడ్ కమెడియన్ కోవై గుణ తదితరులు మరణించారు..
తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కన్నుమూశారనే వార్తతో పరిశ్రమ వర్గాల వారు షాక్‌కి గురయ్యారు.. ప్రముఖ రష్యన్ పాప్ సింగర్ దిమా నోవా మరణించారు.. ఆయన వయసు 35 సంవత్సరాలు.. తన అసలు పేరు దిమిత్రి విర్గినోవ్.. చిన్ననాటి నుంచే తన గానంతో ఎంతోమందిని అలరించిన దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ సంస్థను నడుపుతున్నారు.. ఈ నెల 19న తన సోదరుడుతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గడ్డ కట్టిన వోల్గా నదిని దాటుతున్న సమయంలో పెద్ద ప్రమాదం సంభవించి మంచులో పడిపోయి కూరుకుపోయారు..
ఆ సమయంలోనే దిమా నోవా ఊపిరి ఆడక చనిపోయారు.. మంచు కింద చిక్కుకున్న దిమా నోవా ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మరో స్నేహితుడిని ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూశాడని ‘క్రీమ్ సోడా’ వెల్లడించింది.. తన గాత్తంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న దిమా నోవా.. ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తన సంగీతం, పాటలతో అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శించేవారు..
ఈ క్రమంలోనే ‘అక్వా డిస్కో’ అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. అది పెద్ద వివాదం కూడా అయ్యింది.. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు.. దిమా నోవా చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు..