పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సంగీతం అంటే ఎంత ఇష్టపడతారో అందరికి తెలిసిందే. ప్రతి ఫంక్షన్, ఇంటర్వ్యూలోనూ ఆయన తనకు ఇష్టమైన పాటల గురించి చెబుతుంటారు. తెలుగులో మాత్రమే కాదు, ఇతర భాషలలో కూడా ఆయన ఎన్నో సాంగ్స్‌ను ఆస్వాదిస్తారు. అయితే, ఇటీవల సిరివెన్నెలకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రభాస్ తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలోని పాట గురించి ముచ్చటించారు. తనకు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా (Jalsa) మూవీలోని “ఛలోరే ఛలోరే చల్” సాంగ్ అంటే చాలా ఇష్టమని ప్రభాస్ చెప్పారు.
Prabhas
“అది విన్నప్పుడల్లా ఏదో ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. స్నేహితులతో కలిసి ఈ పాటను వింటూ, ఆ సాహిత్యం వెనుక ఉన్న అర్థాన్ని చెప్తుంటే, వారు ఎప్పుడూ ఆశ్చర్యపోతారు. ఈ పాటలో ఉన్న ఫిలాసఫీ, ప్రతి లైన్ అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ కొనియాడారు. ఆ పాటను లేట్ నైట్ పార్టీల్లో ప్లే చేస్తుంటానని ప్రభాస్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రభాస్‌ను ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పలేనని ఆయన తెలిపారు. “మన లైఫ్ స్టైల్ గురించి ఆలోచింపజేసే పాట అది. ప్రతి సారి విన్నా కొత్తగా ఫీల్ అవుతాను,” అని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. తన చిన్ననాటి నుండి టాలీవుడ్ సంగీతాన్ని ఎంతో ఇష్టపడిన ప్రభాస్, తనకిష్టమైన సాహిత్యం కలిగిన పాటలు గురించి చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగింది.
“జగమంత కుటుంబం నాది” పాట గురించి కూడా చెబుతూ, సాహిత్యం వెనుక ఉన్న భావం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు. సిరివెన్నెల సాహిత్యం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన పేర్కొన్నారు.