టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. దీంతో అతడు వరుసగా పాన్ ఇండియా కథలనే ఎన్నుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా పనులతో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు నాగ్ అశ్విన్ రూపొందించబోయే సైన్స్ ఫిక్షన్ కథలో కూడా నటించనున్నారు. రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ కాకుండా.. మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు.
ఈ సినిమాలన్నీ పూర్తి చేయడానికి ప్రభాస్ కి చాలా సమయం పడుతుంది. ఇంతలో ఈ పాన్ ఇండియా స్టార్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 1982లో విడుదలైన హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమా ‘రాంబో’ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకున్నాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. టైగర్ ష్రాఫ్ హీరోగా సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఇప్పుడు టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
అవి పూర్తి చేసి ‘రాంబో’కి డేట్స్ ఇవ్వడానికి మరో మూడేళ్లు ఈజీగా పడుతుంది. అందుకే ఈ రీమేక్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనౌన్స్మెంట్ రావడానికి సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన తరువాత ప్రభాస్ డేట్స్ లాక్ చేయాలనుకుంటున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!