ప్రకాశ్‌రాజ్ అంటే… ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గుర్తొస్తాయి కానీ. కొన్నేళ్ల క్రితం వరకు అతని వివాదాలే గుర్తొస్తాయి. అనవసర వివాదాలతో ఏకంగా ‘మా’ నిషేధానికి గురయ్యారు కూడా ఆయన. కొన్ని సినిమాల నుండి అర్ధాంతరంగా ఆయన్ని తీసేశారు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో ఆ విషయాలను ఇప్పుడు ఆయన వ్యతిరేకులు బయటకు తీస్తున్నారు. అదే సమయంలో ప్రకాశ్‌రాజ్ కూడా అప్పటి విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు. ప్రకాశ్‌రాజ్.. తెలుగు సినిమాల్లో వివాదాల గురించి చూస్తే… ముందుగా గుర్తొచ్చేది ‘ఆగడు’ సినిమా సమయంలో జరిగిన విషయం.
ఆ సినిమా షూటింగ్ మధ్యలో ప్రకాశ్‌రాజ్ తప్పుకున్నారు. దీనిపై అప్పట్లో వరుస ప్రెస్‌మీట్లు పెట్టి… మరీ ఒకరినొకరు విమర్శించుకున్నారు ప్రకాశ్‌రాజ్, ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల. దీని గురించి తాజాగా ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ… ‘ఆ సినిమా సమయంలో దర్శకుడు శ్రీను వైట్ల నా నటనలో స్పీడు కావాలి అన్నారు. అది నాకు నచ్చలేదు అని చెప్పాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఆ తర్వాతి రోజు… సోనూ సూద్ సెట్‌లోకి వచ్చారు’ అని చెప్పారు ప్రకాశ్‌రాజ్.
ప్రకాశ్‌రాజ్ ప్రస్తావించిన మరో వివాదం. ఓ సినిమా సెట్‌లో కొందరిపై దాడి చేసే ప్రయత్నం. దాని గురించి ప్రకాశ్‌రాజ్ వివరిస్తూ… ‘ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు… ఓ అమ్మాయిపై రాళ్లు విసిరారు. దీంతో ఆ వ్యక్తుల్లో ఒకరిని పక్కకు నెట్టేశాను. దాంతో నా మీద కేసు పెట్టారు. అలా నిర్మాతలు నా మీద నిషేధం విధించారు’’ అంటూ వివరించారు ప్రకాశ్‌రాజ్. ఆయన క్లారిటీ ఇచ్చేశారు… ఇక ప్రత్యర్థులు ఏమంటారో చూడాలి.