ప్రకాశ్ రాజ్ రాజకీయం ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాం. తను విమర్శించాలనుకునే వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా నేరుగా విమర్శించేస్తుంటాడు. అలాంటి ప్రకాశ్ రాజ్ టాలీవుడ్ రాజకీయాల్లోకి అడుగుపెడితే… అవును మీరు అనుకుంటోంది నిజమే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రాజకీయాల్లోకి ప్రకాశ్ రాజ్ రావాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీలో నిల్చుంటాడట. ప్రస్తుతం ఈ పని మీద ప్రకాశ్ రాజ్ బిజీగా ఉన్నాడని కూడా టాక్.
మా ఎన్నికలు గత రెండు, మూడు పర్యాయాలుగా అంత సజావుగా సాగడం లేదు. అసలు సిసలు రాజకీయాల్లా విమర్శలు, బురద జల్లడాలు, వ్యక్తిగత విమర్శలకు వరకు వెళ్తోంది. అందుకే ఈ సారి ఎన్నిక లేకుండా ఏకగ్రీవం అయితే బాగుండు అని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ మా రాజకీయం వైపు చూస్తున్నాడు. అయితే ఇక్కడో విషయం ఏంటంటే… ప్రకాశ్‌రాజ్‌కు చిరంజీవి మద్దతు ఉందట. మామూలుగా మా ఎన్నికల్లో చిరంజీవి మద్దతిచ్చే వ్యక్తే అధ్యక్షుడుగా ఎన్నికవుతుంటారు. అందుకే ప్రకాశ్ రాజ్ కూడా చిరంజీవి వైపు నుండే ట్రై చేస్తున్నాడట.
‘వకీల్‌సాబ్’ సినిమా విడుదలకు ముందు ప్రకాశ్ రాజ్ పాత్ర గురించి పెద్దగా ప్రచారం చేసింది లేదు. సినిమా పోస్టర్లలో ఎక్కడా ఆ ఫొటో కనిపించలేదు. కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే, ప్రకాశ్ రాజ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఈ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కల్యాణ్‌ను మెచ్చుకున్నాడు. చిరంజీవి గురించి కూడా మంచిగానే మాట్లాడుతున్నాడు. దీనంతటి కారణం ‘మా ’ఎన్నికలే అని టాలీవుడ్ వర్గాల టాక్. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.