‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమాకు సంబంధించి గత కొన్నినెలలుగా పాత్రల పరిచయం చేస్తూ వస్తున్నారు. సినిమాలో కాస్త పేరున్న ప్రతి పాత్రను పోస్టర్లను రిలీజ్ చేసి మరీ పరిచయం చేశారు. ఈ క్రమంలో ఓ పాత్రలో నటిస్తున్న యాక్టర్ ఆసక్తి రేకెత్తించారు. సుభద్రా బెన్ అనే పాత్రలో నిఖత్ ఖాన్ అనే సీనియర్ యాక్టర్ నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల పరిచయం ఉన్నవాళ్లకు అయితే ఆమె గురించి తెలిసే ఉంటుంది. లేదంటే కాస్త కష్టమే.
ఒకవేళ మీకు తెలియదు అంటే ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే సినిమాలతో పరిచయం ఉండి, సినిమాల్లోనే ఉన్న నటుడు కమ్ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కూడా ఆమె ఎవరో తెలియదు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల చెప్పుకొచ్చాడు. మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన చిత్రం ‘ఎల్ 2: ఎంపురాన్’. 2019లో వచ్చిన హిట్ మూవీ ‘లూసిఫర్’కి ఇది సీక్వెల్. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముంబయిలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిఖత్ ఖాన్ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. సినిమాలో సుభద్రా బెన్ పాత్ర కోసం నిఖత్ ఖాన్ ఆడిషన్‌కు వచ్చారని, ఆమె నటన నచ్చడంతో ఓకే చేశామని చెప్పారు. ఆ సమయంలో కాస్టింగ్ డైరెక్టర్ తనకు అసలు విషయం చెప్పాడట. అదే ఆమె ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) సిస్టర్ అని. విషయం తెలియగానే ఆమిర్ ఖాన్‌కు ఫోన్ చేసి మాట్లాడాడట పృథ్వీరాజ్.
ఆయన అంతే హుందాగా ‘మా సిస్టర్ పాత్రకు న్యాయం చేయగలదనుకుంటున్నారా?’ అని అడిగాడట. దానికి పృథ్వీరాజ్ ఊహించిన దాని కంటే ఎక్కువ అని చెప్పాడట. అలా ఆమిర్ ఖాన్ సోదరి తొలి సౌత్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఎవరు అనే డౌట్ ఉంటే.. ‘పఠాన్’ సినిమా చూశారుగా షారుఖ్ ఖాన్‌ది (Shah Rukh Khan). అందుకే ఆయనకు వీరతిలకం దిద్దే పాత్రలో నటించినామెనే.