ఇండియన్ సినిమాలో మాంచి జోష్ మీదున్న సినిమా ఇండస్ట్రీ అంటే మలయాళ సినిమా పేరే చెప్పాలి. ఎందుకంటే వారానికో రూ. 100 కోట్ల వసూళ్ల సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలా అని ఫక్తు కమర్షియల్ సినిమాలు తీసి ఆ విజయం అందుకోవడం లేదు. దీంతో ‘మాలీవుడా మజాకా’ అంటూ నెటిజన్లు మెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ చర్చకు రావడానికి కారణం ‘గోట్‌లైఫ్: ఆడు జీవితం’(The Goat Life). పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా తెరెక్కిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకునన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియల్ (బెన్యామిన్) ‘గోట్ డేస్’ నవల రాశారు. ఆ నవలను ‘ఆడు జీవితం’గా తెరకెక్కించారు. 16 ఏళ్ల పాటు శ్రమించి ఈ సినిమాను తీర్చిదిద్దారు.
రూ.82 కోట్లతో ప్రయోగాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమా వారానికి రూ. 100 కోట్ల మార్కు దాటేసింది. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. 72 గంటల పాటు భోజనం లేకుండా మంచినీళ్లు మాత్రమే తాగి సినిమాలో కొన్ని సీన్స్ కోసం నటించారు. మలయాళ పరిశ్రమలో రూ. 100 కోట్ల సినిమా అంటే 2018లో వచ్చిన మోహన్ లాల్ (Mohanlal) ‘పులి మురుగన్’. ఆ తర్వాత మోహన్ లాల్ ‘లూసిఫర్’ ఆ ఘనత సాధించింది.
తర్వాత పెద్దగా రూ. 100 కోట్ల వసూళ్లు లేవు అనుకుంటుండగా… గతేడాది వచ్చిన ‘2018’ ఆ ఫీట్ సాధించింది. 2024కి వచ్చేసరికి మొదటి త్రైమాసికంలోనే మూడు మలయాళ సినిమాలు రూ. 100 కోట్లు కలెక్షన్లు రాబట్టాయి. ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) , ‘ప్రేమలు’ (Premalu) ఈ వసూళ్లు సాధించగా… ఇప్పుడు ‘ఆడు జీవితం’ ఆ ఘనత సాధించింది.