టాలీవుడే కాదు మొత్తం దేశం గర్వించదగ్గ సినిమాలు నిర్మించిన సంస్థ వైజయంతి మూవీస్. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ బ్యానర్‌కి ఓనర్. ఎన్నో ఏళ్లపాటు పెద్ద పెద్ద సినిమాలు తీసి పెద్ద పెద్ద విజయాలు అందుకున్న ఆయన ఇప్పుడు కాస్త సైలంట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఆయన కుమార్తెలు ఇప్పుడు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. స్వప్న సినిమాస్ పేరుతో చాలా ఏళ్లుగా అశ్వనీదత్ (C. Aswani Dutt) కుమార్తెలు సినిమాలు చేస్తున్నా ఇప్పుడు వైజయంతి మూవీస్‌ను కూడా వాళ్లే చూస్తున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) పేరుతో ఇటీవల ఆ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో మీకూ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇండియన్ వెర్షన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ముఖచిత్రంపైకి వచ్చారు. ఇటీవల ఈ మ్యాగజైన్ భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కొత్త ఎడిషన్‌లో తెలుగు నిర్మాతలు, ప్రియాంకా దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt) మెరిశారు.
‘విమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరిట నిర్వహించిన చిట్‌చాట్‌లో వీరితోపాటు ప్రముఖ హీరోయిన్లు నయనతార, ఆలియా భట్, బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో తమకు ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎవరైనా మీకు ఏమైనా సలహాలు చెప్పి ఉంటే బాగుండేదని అనుకున్నారా? అని అడిగితే.. దత్ లేడీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీకు అర్థంకావట్లేదు. ఇండస్ట్రీ అంత ఈజీ కాదు అని నాన్న చెప్పారని స్వప్న చెప్పారు. ఇక మీ స్ఫూర్తి ఎవరు అని ప్రియాంకను అడిగితే.. మాన్నే అని చెప్పారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన మంచి స్క్రిప్టులను ఎంపిక చేయాలని శ్రద్ధగా పని చేస్తున్నారు అని చెప్పారామె. సినిమా అద్భుతమైంది. దానికి కావాల్సింది మనం ఇవ్వాలి అని నాన్న చెబుతారు అని స్వప్న తెలిపారు.
మీరు ఏ సందర్భంలోనైనా అబద్ధం చెప్పారా అని అడిగితే.. దర్శకుడు నాగ్ అశ్విన్‌కి (Nag Ashwin) కొన్ని సార్లు అబద్ధం చెప్పా అని ప్రియాంక తెలిపారు. సినిమాకి బడ్జెట్ ఓకేనా? అని నాగీ అడిగిన ప్రతిసారి ఓకే అని చెబుతూ వచ్చా అని ఆమె తెలిపారు. ఆయన్ను టెన్షన్ పెట్టడం ఇష్టం ఉండదు అని చెప్పారు. ప్రియంకకు (Priyanka Dutt) నాగీ భర్త అవుతారనే విషయం మీకు తెలిసిందే.