సినిమా బడ్జెట్‌లో రెమ్యూనరేషన్లే శాతమే ఎక్కువ.. అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో టికెట్ల తకరారు సాగుతున్నప్పుడు కూడా ఈ విషయమే ఎక్కువ చర్చకు వచ్చింది. ఒక్క హీరో ఉన్న సినిమా అంటేనే రెమ్యూనరేషన్లు కొండెక్కుతున్నాయి. అందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుంటే ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ (సినిమా టైటిల్ అధికారికంగా చెప్పలేదు) పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది అని అంటున్నారు.
సినిమాకు ఖర్చు పెట్టింది వస్తే చాలు అనుకుంటున్న రోజులివి. ఇదేదో చిన్న సినిమా కోసం అన్నాం అనుకునేరు. పెద్ద సినిమాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. మంచి టాక్ వస్తే ఓ రెండు వారాలు బాగా ఆడితే మంచి డబ్బులు వస్తున్నాయి. అలా కాకుండా ఏ మాత్రం టాక్ తేడా కొట్టినా తొలి సోమవారానికే పడిపోతున్నాయి. అలాంటి పరిస్థితి రీసెంట్‌గా ఎదుర్కొన్న సినిమా ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి.
ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? తిరిగి ఆ రేంజిలో వసూళ్లుగా ఇవ్వలేకపోయిన చిరంజీవి సినిమాకు ఇప్పుడు కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ అనేసరికి ఆందోళన మొదలైంది. ఓవైపు రెమ్యూనరేషన్లు తగ్గించాల్సిందే అని నిర్మాతలు పట్టుబడుతుంటే ‘వాల్తేరు వీరయ్య’ రెమ్యూనరేషన్ల బడ్జెట్ ఏకంగా రూ. 70 కోట్ల నుండి రూ. 90 కోట్ల వరకు ఉందని చెబుతున్నారు. ఈ సినిమాకు చిరంజీవికి రూ. 40 కోట్ల నుండి రూ. 50 కోట్ల వరకు అందుతోందని టాక్.
గతంలో వచ్చిన పుకార్ల ప్రకారం చూస్తే.. చిన్న పాత్రే అయినా రవితేజకు ఈ సినిమా కోసం రూ. 16 – రూ.18 కోట్లు ఇస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు బాబీకి సుమారు రూ. 5 కోట్లు – రూ. 7 కోట్లు అందొచ్చని టాక్. మిగిలిన నటీనటుల రెమ్యూనరేషన్ల లెక్కలు అన్నీ చూస్తే ఈ సినిమాకు పారితోషికాలే రూ. 70 కోట్ల నుండి రూ. 90 కోట్లు అవుతున్నాయని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియదు కానీ, ఇంతేసి రెమ్యూనరేషన్లు అంటే తిరిగి ఆ స్థాయిలో రాకపోతే కష్టమే.