P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్ పీఎస్ మిత్రన్ క్లారిటీ
- August 21, 2026 / 02:53 PM ISTByFilmy Focus Desk
అది.. ‘విశ్వంభర’ సినిమా వాయిదా పడిన సమయం.. చిరంజీవి ఆ సినిమాను పక్కన పెట్టి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్న సమయం. నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు అనేది కాస్త కాస్తగా బయటకు వచ్చింది. ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు ఎవరు అనేది తేలలేదు. చాలామంది దర్శకుల పేర్లు చర్చకు వచ్చాయి. అందులో ఓ తమిళ దర్శకుడు కూడా ఉన్నారు. ఆయనే పీఎస్ మిత్రన్..
P.S. Mithran
ఇదంతా మెగా 158 సినిమా గురించే అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు కొల్లి బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. రేపు ఈ సినిమా టీజర్ కూడా విడుదల అవుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్‌కి ముందు పీఎస్ మిత్రన్ చిరంజీవికి ఓ కథ చెప్పారు. దీని మీద చాలా రోజుల చర్చ కూడా జరిగింది. కథ విషయంలో తొలి రోజుల్లో చిరంజీవి కాస్త ఆసక్తిగా ఉన్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన సినిమా వద్దనుకున్నారు అని అప్పుడు చెప్పారు. అప్పుడే బాబి ఈ సినిమాలోకి వచ్చారు అని అంటారు.
తాజాగా.. ఈ విషయమై పీఎస్ మిత్రన్ క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు ఏమైంది అనే వివరాలు చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా కథ, ఆ తర్వాత యశ్‌తో మిత్రన్ చేయాలనుకున్న కథ ఒక్కటే అనే విషయంలోనూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి మిత్రన్ ఓ కథ చెప్పారట. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నారట. అయితే ‘విశ్వంభర’ సినిమా టైమ్‌లైన్‌లో సమస్యలు రావడంతో తమ సినిమా ఆలస్యమైందని, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోయింది అని చెప్పారు.
ఆ తర్వాత యశ్‌కి ఇంకో కథ చెప్పారట మిత్రన్. అయితే అప్పటికే యశ్.. ‘టాక్సిక్’ సినిమాకు ఆయన ఓకే అవ్వడంతో తమ సినిమా ముందుకు వెళ్లలేదు అని చెప్పారు మిత్రన్. మరి తర్వాతైనా ఈ సినిమా ఓకే అవుతుందో లేదో చూడాలి.
















