ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన దగ్గర పని చేసే శిష్యులను ప్రోత్సహించడం మర్చిపోలేదు. తన కథలతో, తన నిర్మాణంలో, తన శిష్యులతో సినిమాలు తీశారాయన. ఆయన నుంచి చాలా మంది శిష్యులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందుకే ఆయనకు దర్శకరత్న అనే పేరొచ్చింది. ఈ తరం దర్శకుల్లో అలా ఎవరైనా ఉన్నారంటే..? సుకుమార్ అనే చెప్పాలి. దర్శకుడిగా పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ..
తన కథలతో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ.. తన అసిస్టెంట్స్ ను ప్రోత్సహిస్తున్నారు సుకుమార్. అంతేకాదు తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లోనే ఈ సినిమాలన్నీ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా నడవబోతున్నారు. దాసరిలానే.. ఒక్కరోజులోనే కథ రాసే సత్తా పూరి జగన్నాధ్ కి ఉంది. ఆయన దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లు యాభై వరకు ఉన్నాయట. ఆ సినిమాలన్నీ పూరి జగన్నాధ్ అయితే తీయలేరు.
అందుకే తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ద్వారా వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొద్దామనుకుంటున్నారు. పూరి ఇదివరకు కూడా తన కథలతో సినిమాలు తీయించారు కానీ ఈసారి మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. తన శిష్యులనే కాదు.. యంగ్ టాలెంట్ ఎవరిలో ఉన్నా.. వాళ్లను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు పూరి.
ఆయా సినిమాలకు తనే కథ, మాటలు అందించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి.. ‘జనగణమన’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరోపక్క ‘లైగర్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ ల నుంచి కాస్త గ్యాప్ దొరకగానే.. పూరి నిర్మాతగా నాలుగైదు సినిమాలను ఒకేసారి ప్రకటించాలనుకుంటున్నారు.