టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీస్ ఒకటి. ఇప్పుడు ఈ సంస్థ ఒకేసారి వరుస సినిమాలు పట్టాలెక్కించడానికి ప్లాన్ చేసింది. దీనికోసం చాలా మందికి అడ్వాన్స్ లు ఇవ్వాలి.. ఎంతో ప్లాన్ చేయాలి. దానికి చాలా ఫండ్స్ అవసరమవుతాయి. దీనికోసం ప్లానింగ్ లో ఉన్న సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు కూడా ముందుగానే సేల్ అగ్రిమెంట్ లు చేసేస్తూ ఉంటారు. అది కూడా ఒకరకంగా లాభమే. వడ్డీ లేకుండా ఫండింగ్ వస్తుంది.
అయితే ఒక్కోసారి అదే సినిమాకి మైనస్ అవుతుంది. ‘పుష్ప’ సినిమా విషయంలో ఇలానే అయిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ‘పుష్ప’ ఆడియో రైట్స్ ను ఎప్పుడో అమ్మేశారు. అప్పట్లో ‘ఉప్పెన’, ‘పుష్ప’ రెండు సినిమాల ఆడియో రైట్స్ ను కలిపి ఐదు కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత బన్నీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు గనుక సినిమాను అమ్మితే ఐదు కోట్ల వరకు కేవలం ‘పుష్ప’ సినిమాకే వచ్చేవి.
అయితే ఇక్కడ మరో లాజిక్ ఉంది. సినిమా ఫైనాన్స్ అంటే వడ్డీలు చాలానే ఉంటాయి. అలా చూసుకుంటే ఈ సినిమాకి గిట్టుబాటు అయినట్లే. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు. వేరే హీరోల సినిమాల ఆడియో హక్కులతో పోల్చుకుంటూ తమ హీరో సినిమా రైట్స్ తక్కువకి అమ్మారనేదే వాళ్లు చూస్తారు.