ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లతో థియేటర్లను నడపలేమని పలువురు థియేటర్ల యజమానులు స్వచ్చందంగా థియేటర్లను మూసివేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిబంధనలు పాటించని థియేటర్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి ఏపీలో థియేటర్ల పరిస్థితి గురించి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్యామ్ సింగరాయ్ సక్సెస్ మీట్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ థియేటర్ల పరిస్థితిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లను
మూసివేశారనే వార్తను చదువుతుంటే తనకు ఏడుపొస్తుందని నారాయణమూర్తి వెల్లడించారు. సినిమా చూసేవాడు, చూపించేవాడు, తీసేవాడు బాగుంటే మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఇండస్ట్రీపై ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్ల విషయమై ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలకు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు, నిర్మాతలకు, నటులకు విజ్ఞప్తి చేస్తున్నానని నారాయణమూర్తి అన్నారు. థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసేయవద్దని స్థానిక మంత్రులను కలవాలని నారాయణమూర్తి సూచించారు.
సమస్యను సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లాలని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ప్రభుత్వంతో పాజిటివ్ గా ఉండాలని నెగిటివ్ గా ఆలోచించవద్దని నారాయణమూర్తి వెల్లడించారు. ఎమోషన్ అవ్వొద్దని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం జగన్ కు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ థియేటర్ల పరిస్థితి గురించి నాని ఒక విధంగా మాట్లాడితే అందరికీ మరో విధంగా అర్థమైందని తెలిపారు.
ఆరోజు నాని ఎమోషన్ తో మాట్లాడారు తప్ప నెగిటివ్ గా స్పందించలేదని దిల్ రాజు వెల్లడించారు. నానిని ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని దిల్ రాజు కోరారు. శ్యామ్ సింగరాయ్ సినిమాకు 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా తొలి వీకెండ్ లోనే ఈ సినిమా 18 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. శ్యామ్ సింగరాయ్ సాధిస్తున్న కలెక్షన్ల విషయంలో నిర్మాత సంతృప్తితో ఉన్నారు.