రాజమౌళి (S. S. Rajamouli) ఫ్యాన్స్ దృష్టిలో #SSRMB.. మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ దృష్టిలో #SSMB29గా పిలుస్తున్న సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఓ మట వింటున్నాం. సినిమా టీమ్‌తోపాటు ఆ బృందంతో సంబంధం లేని సన్నిహితుడు హీరో నాని కూడా ఓ వేదిక మీద ఆ సినిమా గురించి ప్రస్తావించాడు. సినిమాను చాలా కష్టపడి తీస్తున్నారని, అలాంటి సినిమాకు సంబంధించిన అంశాలను లీక్ చేయడం సరికాదు అని అంటున్నారు. ఈ విషయంలో నెటిజన్లు, ఫ్యాన్స్ కాస్త సంయమనం పాటించాలి అని కూడా అంటున్నారు.
అయితే ఈ లీకుల విషయంలో మొత్తం తప్పు ఫ్యాన్స్, నెటిజన్లదేనా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. దీనికి కారణం సినిమా లుక్‌లు, విషయాలకు సంబంధించిన లీకులు సినిమా సెట్స్ నుండే కాదు బయట నుండి వస్తున్నాయి. అంటే ఆఫ్‌సెట్స్ విషయాలు అన్నమాట. సినిమా షూటింగ్ కోసమనో, వ్యక్తిగత పనుల కోసమో హీరో మహేష్‌బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) బయటకు వచ్చినప్పుడు కెమెరాలు క్లిక్ మంటున్నాయి. ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. ఆ విషయంలో ఫ్యాన్స్, నెటిజన్ల తప్పేమీ లేదు.
ఈ సినిమా స్పాన్ కారణంగానో, లేక ఇంకే కారణాలు ఉన్నాయనో తెలియదు కానీ.. రాజమౌళి ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఒడిశాలోని దేవ్ మాలి పర్వత ప్రాంతంలో చిత్రీకరించారు. బయట షూట్ అన్నప్పుడు ఫొటోలు బయటకు రావడం సహజం. ఇక సినిమా షూటింగ్ సమయంలో సీజ్ చేసిన పాస్‌పోర్టును వెనక్కి తీసుకున్న మహేష్‌బాబు విదేశాల్లో ట్రిప్పులు వేస్తున్నాడు. ఆ ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. వీటి విషయంలోనూ నెటిజన్లు, ఫ్యాన్స్ తప్పు లేదు.
ఈ లెక్కన చెప్పొచ్చేది ఏంటంటే.. ‘బాహుబలి’ (Baahubali) సినిమాల సమయంలో రాజమౌళి వాడిన కాన్సెప్ట్‌నే ఇప్పుడూ యూజ్ చేస్తే ఈ ఇబ్బందులు అన్నీ పోతాయి. అదే ‘లాక్ అండ్ షూట్’. అవును ఆ సినిమాల సమయంలో మొత్తం ప్రధాన టీమ్‌ను ఓ స్టూడియోలో ఉంచి.. విషయాలు బయటకు రాకుండా చూసుకున్నారు రాజమౌళి. అందుకే ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అనే మాట బయటకు రాలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వాడితేనే లీకులు ఆగుతాయి. మరి ఈ మాటను టీమ్ వింటుందా? మహేష్‌బాబు వింటారా? ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.