సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా షూటింగ్ లీక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒడిశాలో జరిగిన అవుట్‌డోర్ షెడ్యూల్‌లో మహేష్ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడం టీమ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. రాజమౌళి సినిమాలు ఎంతో రహస్యంగా రూపొందుతాయని అందరికీ తెలిసిందే. కానీ ఈసారి లీక్ కావడంతో, సినిమా భద్రత విషయంలో జక్కన్న కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
ఈ ఘటన తరువాత రాజమౌళి పని విధానంలో కీలకమైన మార్పు చేయాలని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఇకపై అవుట్‌డోర్ షూటింగ్‌లను తగ్గించేందుకు దర్శకుడు సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముందుగా ప్లాన్ చేసుకున్న కొన్ని సీన్స్ ను, కాశీ లాంటి ప్రాముఖ్యమైన లొకేషన్లను నిజంగా షూట్ చేయకుండా, హైదరాబాద్‌లోనే ప్రత్యేకంగా సెట్స్ రూపొందించి చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
ఈ విధంగా లీక్‌లను పూర్తిగా కంట్రోల్ చేయడంతో పాటు, భారీ ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కూడా ఎక్కువగా ఇన్‌డోర్ షూటింగ్‌లను ప్రిఫర్ చేసే హీరో. అత్యధిక చిత్రాలు స్టూడియోలే సెటప్ చేయించుకుని షూట్ చేసిన అనుభవం ఉన్న మహేష్‌కి ఇది హ్యాపీ డెవలప్‌మెంట్ అనే చెప్పాలి. పైగా, రాజమౌళి కూడా ఇప్పుడు అదే మార్గంలో వెళ్లాలని డిసైడ్ కావడంతో, ఇకపై ఈ సినిమాలో ఎక్కువ భాగం హైడ్రామా సెట్స్‌లోనే తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, అవుట్‌డోర్ షూట్‌కి సంబంధించి మరిన్ని భద్రతా చర్యలు తీసుకునేలా టీమ్ ముందుకెళ్తుందని సమాచారం. ముఖ్యంగా, షూటింగ్ లొకేషన్లలో మొబైల్ ఫోన్లు పూర్తిగా బ్యాన్ చేయాలని చూస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసినప్పటికీ, అక్కడి సిబ్బందికి కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.