తెలుగు సినిమా చరిత్రను రాయడానికి మరో అడుగు దూరంలో ఉంది. మల్టీ స్టారర్‌గా మొదలై.. పాన్ ఇండియా సినిమాగా మారి.. ఆ తర్వాత గ్లోబల్ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఆస్కార్ పురస్కారం కోసం నామినేట్ అయ్యి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా తయారైంది. ఓ భారతీయ సినిమాకు అందులోనూ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం విశేషం. ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు, దాంతోపాటు ఈ నామినేషన్ వచ్చిన నేపథ్యంలో రాజమౌళి రిలీజ్ చేసిన నోట్ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.
95వ ఆస్కార్ పురస్కారాల్లో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. దీంతోపాటు ఇతర దేశాలకు చెందిన మరో మూడు పాటలు కూడా నామినేట్ అయ్యాయి. మార్చి 13న ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఆ రోజు మన ‘నాటు నాటు’కు పురస్కారం వస్తుందో లేదో తెలిసిపోతుంది. అయితే ఈలోపు టీమ్ మరోసారి విదేశీ పర్యటన చేయాల్సి ఉంటుంది. సినిమా గురించి చాలా ప్రెస్ మీట్‌లు, సభలు, షోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ రాజమౌళి చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది.
‘‘మా పెద్దన్న కీరవాణి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఇంతకంటే నేనేం ఎక్కువ కోరుకోలేను. ఇప్పుడు నేను తారక్, చరణ్ కంటే ఎక్కువగా వేగంగా ‘నాటు నాటు’ స్టెప్ వేస్తున్నాను’’ అని కామెంట్ చేశారు. అలాగే గీత రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు.‘‘కాల భైరవ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇన్‌స్పైర్ అయ్యే ‘నాటు నాటు’ పాటను రూపొందించాం. అలాంటి బీజీఎం ఇచ్చినందుకు థ్యాంక్‌యూ భైరి బాబు’’ అని ట్వీట్ చేసిన రాజమౌళి.. రాహుల్ గాత్రం పాటను ఇంకాస్త ఎన్‌హాన్స్ చేసిందని మెచ్చుకున్నారు.
దీంతోపాటు ఈ పాట, సినిమా రూపొందించడంలో ఎంతగానో శ్రమించిన కార్తికేయకు, వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్‌కి కూడా ధన్యవాదాలు’’ అని చెప్పారు రాజమౌళి. రామ్‌చరణ్, తారక్ గురించి మాట్లాడుతూ ‘‘ఈ పాట ఇంతలా రావడానికి, ఇప్పుడు పేరు రావడానికి, అవార్డు రావడానికి తారక్, చరణ్ సింక్.. స్టైల్ కూడా కారణం. ప్రపంచం మనసులు గెలుచుకునేలా వాళ్లు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో మిమ్మల్ని పెట్టిన టార్చర్‌కు సారీ. అయితే మరోసారి మిమ్మల్ని టార్చర్ చేయడానికి వెనుకాడను’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు జక్కన్న. అదన్నమాట మేటర్.