సినిమాను బాగా తెరకెక్కించడం ఎంత ముఖ్యమో.. దాన్ని అంతే బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయం బాగా తెలిసిన దర్శకుల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. ఆయన సినిమాల కాన్వాస్ ఎంత పెద్దగా ఉంటుందో.. ఆయన ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఇలాంటి ప్రచార ఫీట్లు చేయని రాజమౌళి.. ఆ తర్వాత వేగం పెంచుకుంటూ వచ్చారు. ‘బాహుబలి’ సినిమాలు వచ్చాక.. ఆయన పూర్తిగా మారిపోయారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు ఇంకా అనుభవం పెరిగింది.
ఈ ఫ్లోలో రాజమౌళి తన కొత్త సినిమా (#SSRMB / #SSMB29) కోసం మహేష్ బాబుతో కలసి వీర లెవల్‌లో ప్రచారం చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రచార పవర్ చూపించడానికి జక్కన్నకు మరో అవకాశం వచ్చింది. దీంతో మరోసారి తన టీమ్‌ను యాక్టివేర్. ఆయన సినిమాల ఫ్లో గురించి తెలిసినవాళ్లకు ఇదంతా ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా గురించే అనేది తెలిసే ఉంటుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలసి ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమాను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.
రెండు సినిమాలను కలిపి మెగా ‘బాహుబలి’ రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం రాజమౌళి అండ్ మొత్తం టీమ్ ఇంటర్వ్యూలు రెడీ చేయించారట. త్వరలో ఒక్కో వీడియోను రిలీజ్ చేసి సినిమా మీద హైప్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారట. ఈ ఇంటర్వ్యూల్లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, తమన్నాతోపాటు టెక్నికల్ టీమ్ గ్రూప్ ఇంటర్వ్యూలు రెడీ అయ్యాయట. వీటన్నింటిని యాంకర్ సుమనే హోస్ట్ చేశారు అని సమాచారం.
అక్టోబరు 31న సినిమా రానున్న నేపథ్యంలో 30వ తేదీ కల్లా అవన్నీ అయిపోతాయట. అయితే, రీరిలీజ్ సినిమాకు ఇంత స్థాయిలో ప్రచారం అవసరమా అంటే.. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది అని అంటున్నారు. చూద్దాం మరి జక్కన్న ఇంకెలాంటి కొత్త విషయాలు సినిమా విడుదలకు, విడుదల రోజు చెబుతారో.