సాధారణంగా నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు తొలిరోజు కలెక్షన్లు ఎక్కువగా వచ్చినా తర్వాత రోజు నుంచి తక్కువ కలెక్షన్లు వస్తాయి. అయితే బన్నీ నటించిన పుష్ప సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఏకంగా 90.57 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. బన్నీకి ఊహించని స్థాయిలో ఉన్న క్రేజ్ వల్లే ఈ స్థాయిలో రికార్డులు సాధ్యమయ్యాయని చెప్పవచ్చు. పుష్ప పార్ట్1 సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లు సైతం ఈ కలెక్షన్లను చూసి అవాక్కయ్యారు.
బన్నీ నట విశ్వరూపంతో అభిమానులను ఆకట్టుకోగా దేవి శ్రీ ప్రసాద్ పాటలు, రష్మిక గ్లామర్, సుకుమార్ టేకింగ్ పుష్ప పార్ట్1 ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయని చెప్పవచ్చు. ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. క్లాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోకపోయినా మాస్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. పుష్ప పార్ట్1 సాధించిన కలెక్షన్లను చూసి రాజమౌళికి టెన్షన్ తగ్గిందని సమాచారం.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలలో ఏ సినిమా కూడా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు. అయితే పుష్ప పార్ట్1 ఫుల్ రన్ లో 130 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. ఈ కలెక్షన్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ భారీగా కలెక్షన్లను సాధిస్తుందని రాజమౌళి భావిస్తున్నారు. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలులో ఉన్నా పుష్ప మంచి కలెక్షన్లు సాధించడం ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు సంతోషాన్ని కలిగించిందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. ఏపీలో టికెట్ రేట్లు పెరగడంతో పాటు అదనపు షోలకు అనుమతి లభిస్తే ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల విషయంలో ఊహించని రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.