రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు అంటుంటారు అతనితో పని చేసేవాళ్లు. ఇంట్లో వాళ్లే ఆయనకి పని రాక్షసుడు అని బిరుదు కూడా ఇచ్చేశారు. తొలి సినిమా నుంచి రాజమౌళి ఇలానే ఉన్నాడా… అంటే అవుననే చెప్పాలి. ప్రతి పనిలో పర్‌ఫెక్షన్ కోసం చూసి, ఆలస్యం చేస్తుంటాడు కూడా. చాలా సినిమాల టీజర్లు, ట్రైలర్ల విషయంలో ఇదే జరిగింది. అంతగా పనిలో నిమగ్నమైపోయి టైమ్ లిమిట్స్ కూడా మరచిపోతుంటాడు జక్కన్న. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలోనూ రాజమౌళి అలానే పని చేస్తున్నాడట.
కరోనా ప్రపంచానికి చేసిన నష్టాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆలస్యం ఒకటి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి ఎన్టీఆర్ – రామ్‌చరణ్ వెండితెరపై కలసి సందడి చేసి ఏడెమినిది నెలలు దాటిపోయేది. కరోనా కష్టాలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ మొదలుపెట్టాడు. మధ్యలో కొన్ని అవాంతరాలు రావడం, చిత్రబృందంలో కరోనా కేసులు లాంటివి వెలుగుచూడటంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో కూడా రాజమౌళి సినిమా పనుల్లో బిజీగానే ఉంటున్నాడు. ఎంతగా అంటే రాత్రి, పగలు అనే తేడా కూడా తెలియకుండా.
కరోనా ఆలస్యంతో వచ్చిన ఆలస్యాన్ని నివారించడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ డబుల్ వర్క్ చేస్తోందట. షూటింగ్ ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరో వైపు జరుగుతోందట. వివిధ దేశాల్లో ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. అక్కడి నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. దీంతో జక్కన్న అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి.. పనులు పూర్తి చేయిస్తున్నాడట. కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ మార్పలు, చేర్పులు చేయించుకుంటున్నాడట. దీంతో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిచిపోయాయనే మాట కూడా వినిపిస్తోంది.
ఇక సినిమా విడుదల విషయంలో ఎలాంటి స్పష్టత రానప్పటికీ… ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట రాజమౌళి. అయితే వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అన్నట్లు ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ టీజర్ విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. జక్కన్న బిజీ వర్క్ దానికోసమేమో మరి.