ఈ టైటిలే ప్రయోగాత్మకంగా ఉన్నా.. ఇక్కడ ఆ అవసరం ఉంది మరి. సాధారణంగా నటులు ప్రయోగాలు చేస్తున్నారంటే తమ శరీర ఆకృతిని మార్చుకోవడం, పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా సాహసించడం వంటివి గుర్తొస్తాయి. రజనీ విషయంలో మాత్రం ఇలా అనుకోడానికి వీల్లేదు. రజనీ అనగానే స్టైల్, పంచ్ డైలుగులు కళ్ళముందు కదలాడుతాయి. ఆరుపదుల వయసులోనూ ప్రేక్షకలోకం ఆయన్నుండి ఆశించేది కూడా అవే. రీరికార్డింగ్ లేకుండా ఆయన సినిమా చూడటం అంటే మూకీ సినిమా చూసినట్టే. రజనీ సినిమాల్లోని నేపథ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) ప్రతి అభిమానికి కంఠతా వచ్చేస్తుందంటే ఆ ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. మరి ఇవేవీ లేకుండా రజనీ సినిమా అంటే ప్రయోగమే కదా. విషయానికొస్తే…
మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం ‘ఒప్పం’ రీమేక్ లో తలైవా నటించనున్నారట. వైకల్యం గల పాత్రలో మోహన్ లాల్ నటించారు. ఇటీవల చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ రజనీ ఇంట్లోనే ప్రత్యేకంగా సినిమా చూపించారట. ఆ సినిమాని మెచ్చిన రజనీ త్వరలోనే ఏ విషయం చెబుతానన్నారట. ‘కబాలి’ సినిమాలోను రజనీ భార్య, బిడ్డల కోసం తపించే వ్యక్తిగా మామూలు మనిషిగా నటించారు. ఆయన నటనకు వంక పెట్టలేం కానీ తొలి నుండి రజనీ సినిమాల్లో ఉన్న ముద్ర ఇందులో కనపడకపోయేసరికి అభిమానులు పెదవి విరిచేశారు. కబాలి దర్శకుడు రంజిత్ తో చేయనున్న రెండో సినిమా కూడా ఇదేవిధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రయోగాలు రజనీకి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తాయో..!