సినిమాల్లో కొత్త నటులను, దర్శకులను ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలని చెబుతుంటారు. ఈ మాట చాలామంది చెబుతారు కానీ.. ఆచరించేది, ఆదరించేది మాత్రం చాలా తక్కువమందే అని చెప్పాలి. స్టార్ హీరోల్లో ఇలా డేరింగ్ చేసి, డాషింగ్ కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చే స్టార్ హీరోల లిస్ట్ రాస్తే.. తొలి పేర్లలో సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఆ స్థానానికి మరోసారి గౌరవం తెస్తే.. రజనీ మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు అని చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. మరపురాని సినిమా అవుతుంది అని మాత్రం చెప్పొచ్చు.
తమిళంలో ఇటీవల పెద్దగా అంచనాలు లేకుండా, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ సినిమా మౌత్ టాక్‌తోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే అతిశయోక్తి కాదు. తమిళంలో ‘లవ్ టుడే’ సందడి చూసి.. తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా అదిరిపోయే టాక్, వసూళ్లు సంపాదించింది. అయితే అనుకున్నంత డబ్బులు రాలేదు అని చెబుతున్నారు. ఆ విషయం పక్కనపెడితే సినిమాలో నటించి, దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్‌కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అంటున్నారు.
రజనీకాంత్ ఇటీవల కాలంలో సినిమాలు చేస్తున్న దర్శకులు చూస్తే.. అంతా కుర్రవాళ్లే. పట్టుమని పది సినిమాలు కూడా చేయనివారికే రజనీ ఛాన్స్‌లు ఇస్తూ వస్తున్నారు. అలా ప్రదీప్ రంగనాథన్‌కు కూడా ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల లైకా సంస్థ రజనీకాంత్‌తో రెండు ప్రాజెక్టులు లాక్ చేసింది. అందులో ఓ సినిమా ఛాన్స్ ప్రదీప్‌కు వచ్చిందట. అంతకుమందు ఆ సినిమా వేరే దర్శకుడికి ఇచ్చినా.. కథ విషయంలో సంతృప్తి లేకపోవడంతో పక్కకు తప్పించారని చెబుతున్నారు.
ఇందాక చెప్పినట్లు రజని గత రెండు మూడేళ్లుగా యంగ్ డైరెక్టర్స్‌తో పని చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇలా కొత్త తరం దర్శకులే రజనీని మెప్పిస్తున్నారు. అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయా? అంటే ఆశించిన స్థాయిలో కాదు అని చెప్పొచ్చు. అయినప్పటికీ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడానికి రజనీ ముందుకొచ్చారు అంటే అతని ధైర్యం ఎంతో చెప్పొచ్చు.