సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళంలో సీనియర్ స్టార్ దర్శకులు అస్సలు ఫామ్లో లేరు. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ‘థగ్ లైఫ్’ సినిమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రజినీకాంత్ కూడా అలాంటి అనుభవాలు ఎక్కువగానే ఉన్నాయి. ‘లింగ’ నుండి చూసుకుంటే ‘దర్బార్’ వంటి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అందుకే సీనియారిటీకి, స్టార్ డమ్ కి వాల్యూ ఇవ్వకుండా టాలెంట్ ఉన్న కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికే రజినీకాంత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కథ నచ్చితే తెలుగు దర్శకులతో కూడా సినిమాలు చేయడానికి ఆయన సిద్దంగానే ఉన్నారని చెప్పాలి. మరో నెల రోజుల్లో ‘కూలి’ గా ప్రేక్షకుల ముందుకు రానున్న రజినీ అటు తర్వాత ‘జైలర్ 2’ లో నటిస్తారు. మరోపక్క కొత్త కథలు కూడా వింటున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ నిథిలన్ సామినాథన్ చెప్పిన కథకి ఇంప్రెస్ అయినట్లు తెలుస్తుంది.
‘మహారాజ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నిథిలన్. అంతకు ముందు కూడా ‘కురంగు బొమ్మై’ అనే సినిమా చేశాడు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ.. కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ‘మహారాజ’ సినిమా అయితే తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా చైనాలో కూడా విజయం సాధించింది. ‘మహారాజ’ వంటి స్క్రీన్ ప్లే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై రాలేదు అనే చెప్పాలి.
ఎమోషనల్ కంటెంట్ ను చాలా థ్రిల్లింగ్ గా చెప్పాడు నిథిలన్. అందుకే ఇతనితో టాలీవుడ్ టాప్ హీరోలు సైతం వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యే ఓ మంచి కథ నిథిలన్ వద్ద ఉందట. అందుకే ఇటీవల రజినీకాంత్ ను కలిసి ఆ కథ వినిపించాడు. రజినీకాంత్ సైతం ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.