ఓ సినిమా ఫలితం మరో సినిమా దర్శకుడిని మార్చేస్తుందా? అదేం ప్రశ్న.. ముందుగా అనుకున్న దర్శకుడిని, అంతకుముందు సినిమా ఫలితంలో ఎలా మార్చేస్తారు? అని అంటారా. చిన్న హీరోల విషయంలో ఏమో కానీ, పెద్ద హీరోల విషయంలో మాత్రం ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది కూడా. అంతెందుకు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ‘జైలర్’ సినిమా విషయంలో ఇలాంటి ఆలోచననే కొంతమంది రజనీకాంత్ దగ్గరకు తీసుకొచ్చారట. ఈ విషయాన్ని రజనీకాంతే చెప్పారు. ‘జైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ మేరకు కొన్ని కామెంట్స్ చేశారు.
రజినీకాంత్‌కి (Rajinikanth) తన స్థాయి హిట్ వచ్చి చాలా రోజులు అయిపోయింది అని చెప్పాలి. ‘రోబో’ సినిమాత తర్వాత ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశపరిచాయి. ‘కబాలి’, ‘2.0’… లాంటి సినిమాలకు భారీ వసూళ్లు వచ్చినా.. రజనీ స్థాయి విజయం కాదు అనే అంటారు. ‘పేట,’ ‘దర్బార్’ ‘అన్నాత్తె’ లాంటి సినిమాలు అయితే పెద్ద డిజాస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తలైవా అభిమానుల ఆశలన్నీ ‘జైలర్’ సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమా అనుకున్నాక వచ్చిన ‘బీస్ట్’ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకోవడంతో ‘జైలర్’ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి.
దర్శకుడు నెల్సన్ దిలీప్‌కు రజనీ ఛాన్స్ ఇవ్వడం లేదు, అనుకున్న సినిమా ఆగిపోయింది అని వార్తలొచ్చాయి. అయితే, ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా మొదలైంది, పూర్తయిపోయింది కూడా. అయితే ఈ సినిమా సమయంలో జరిగిన ఓ విషయాన్ని రజనీకాంత్ ఇటీవల చెప్పుకొచ్చారు. ‘బీస్ట్’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక నెల్సన్ ‘జైలర్’ స్టోరీ లైన్ చెప్పారు. పది రోజుల తర్వాత పూర్తి స్క్రిప్టుతో వచ్చారట. నచ్చడంతో రజనీ సినిమా ఓకే చేశారట. ‘బీస్ట్’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు రజనీకి ఫోన్ చేసి తర్వాతి సినిమా నుండి నెల్సన్‌ను దర్శకుడిగా తప్పించమన్నారట.
అయితే రజనీ మాత్రం నెల్సన్‌ను నమ్మారట. దానికి తోడు సన్ పిక్చర్స్ వాళ్లు కూడా ‘బీస్ట్’కు మంచి రివ్యూలు రాలేదు కానీ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోలేదని చెప్పారట. దీంతో నెల్సన్‌తోనే ‘జైలర్’ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం అని రజనీ చెప్పారు. అందుకు తగ్గట్టే నెల్సన్ మంచి సినిమా ఇచ్చారు అని రజనీ చెప్పారు.