సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార కలిసి ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పునః ప్రారంభమైంది. కానీ ఇప్పుడు మరోసారి షూటింగ్ కి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెట్లో కరోనా కేసులు నమోదు కావడంతో షూటింగ్ అర్ధాంతరంగా ఆపేశారు. సెట్ లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. రజినీకాంత్ తో కలిసి పని చేసిన సాంకేంతిక సిబ్బందికి కూడా కరోనా సోకిందని.. దీంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది.
దీంతో రజినీకాంత్ గురువారం నాడు తిరిగి చెన్నైకి వెళ్లనున్నారట. కరోనా పరీక్షల అనంతరం రజినీకాంత్, నయనతార తదితరులు సెల్ఫ్ క్వారెంటైన్ లోకి వెళ్లనున్నారు. గత వారంలో రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కి చేరుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 14న షూటింగ్ మొదలైంది. 45 రోజుల షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి.
తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నయన్ తో పాటు కీర్తి సురేష్, మీనా, ఖుష్భు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తానని ఇటీవల మీడియా ముఖంగా వెల్లడించారు రజినీకాంత్. కానీ ఇప్పుడు షూటింగ్ ఆగిపోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.