రాకేష్ మాస్టర్ గత నెల జూన్ 18 న మరణించిన సంగతి తెలిసిందే. వైజాగ్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఆయన సడన్ గా అనారోగ్యం పాలయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఆయన మరణించారు. ఇక ఆయన మరణాన్ని ఆయన శిష్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం విగ్రహం పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన చేసిన సేవలకి గాను ఆయన సన్నిహితుడు ఆలేటి ఆటం హైదరాబాద్ లో 11 అడుగుల విగ్రహాన్ని పాటించడానికి రెడీ అయ్యారు.
ఎక్కడ పెట్టిస్తారు అనేది త్వరలో వెల్లడిస్తారు. రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్.రామారావు. ఈయన తిరుపతిలో జన్మించారు. సినిమాల్లోకి వచ్చాక ఈయన రాకేష్ మాస్టర్ గా పేరు మార్చుకున్నారు.టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు రాకేష్ మాస్టర్ శిష్యులే. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి నటీనటులు కూడా రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారు.
లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య వంటి హిట్ సినిమాలకి ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయన చివరి రోజుల్లో పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. అయితే స్వతహాగా ఆయన చాలా మంచి మనిషి అని ఆయన శిష్యులు చెబుతుంటారు. అందుకే విగ్రహం పెట్టడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది.