చిరంజీవి ఆతిథ్యం గురించి చెప్పేటప్పుడల్లా…సినిమా వాళ్లు గుర్తు చేసుకునే వంటకం… ‘చిరంజీవి దోశ’. సాధారణ దోశకు, ఊతప్పానికి మధ్యలో ఈ దోశ ఉంటుందని టాక్. ఏ మాత్రం నూనె వాకుండా ఆ దోశ చేస్తారని, అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు. చాలా ఏళ్ల నుండి సినిమా జనాల నోట ఈ మాట వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ దోశ గురించి పెద్దగా ఎక్కడా వినిపించడం లేదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచారంలో ఈ దోశ గురించి చర్చ వచ్చింది.
‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచారంలో భాగంగా రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముంబయిని చుట్టేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో వరుస వీడియో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో టీమ్ కూడా రామ్‌చరణ్, తారక్‌ను ఇంటర్వ్యూ చేసింది. అందులో చరణ్ ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. ఇందులో భాగంగా హోస్ట్ రకరకాల ప్రశ్నలు వేశారు. స్పైసీనెస్‌ను ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనే అంశం మీద ఈ వీడియో నడిచింది. ఆ వీడియోలో చరణ్ తన ఆహారపు అలవాట్లు, ఇష్టాయిష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
తాను మాంసాహారం కంటే శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి చరణ్… హైదరాబాదీ బిరియానీ తన ఓటు అని చెప్పేశాడు. స్వీట్స్ కంటే కారం ఎక్కువగా తింటాను అని కూడా చెప్పాడు. అలాగే టీ, కాఫీలలో కాఫీకే తన ఓటు అని కూడా చెప్పాడు. ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారా? లేక బయట తిరగడానికా అంటే… ఇంట్లో ఉండటానికే ఓటేశాడు చరణ్. ఒక సోఫా ఇస్తే రోజంతా అందులో కూర్చుని గడిపేస్తా అని అన్నాడు రామ్‌చరణ్.
అప్పుడే చిరంజీవి దోశ గురించి చర్చ వచ్చింది. అందులో ఏమేం వాడతారు అని హోస్ట్ అడిగితే… బియ్యం, ఉప్పు, నీళ్లు అని చెప్పి… ఇంకో మిస్టరీ పదార్థం ఉంటుంది. మా అమ్మ మాకు ఎప్పుడూ చెప్పలేదు అని ముగించేశాడు చరణ్. అలాగే తనకు మొక్కజొన్న అంటే అస్సలు పడదని… ఆహారంలో మొక్కజొన్న లేకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఇదీ చరణ్ ఫుడ్ ఇంట్రెస్ట్స్. త్వరలో తారక్ గురించి కూడా తెలుస్తుంది.