మెగాస్టార్ చిరంజీవికి మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా చెయ్యాలని అప్పట్లో చాలా కోరికగా ఉండేది. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అని ప్రచారం మొదలవ్వగానే .. ఈ కథతోనే రీ ఎంట్రీ ఇస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అంత పెద్ద బడ్జెట్ పెట్టించి… నిర్మాతను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక మొదట దానిని రీ ఎంట్రీ చిత్రంగా చెయ్యలేదు. తరువాత ‘నేనే నిర్మిస్తాను’ అంటూ రాంచరణ్ ముందుకు వచ్చాడు. అలా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించి తండ్రి మెగాస్టార్ చిరంజీవి కలను నిజం చేసాడు రాంచరణ్.
ఇప్పుడు తన తల్లి సురేఖ కలను నెరవేర్చడానికి రెడీ అయ్యాడట. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చరణ్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ పాత్ర కోసం మహేష్ బాబుని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల చరణ్ నే ఫైనల్ చేశారు.అయితే ఈ చిత్రంలో నటించడం గురించి తాజాగా చరణ్… ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. “స్టార్‌డమ్, ప్రేక్షకుల అభిమానం.. వంటివి మా నాన్న వల్ల నాకు సంక్రమించినవే.!
ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. 2015లో నేను నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో కనిపించారు.అలాగే ఆయన నటించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశాను. ఇప్పుడు ‘ఆచార్య’లో మళ్లీ కలిసి నటించే అవకాశం లభించింది.నేను, నాన్న కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్ చెయ్యాలనేది మా అమ్మ కల. ‘ఆచార్య’తో అది నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉంది” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.