‘టైగర్ నాగేశ్వరరావు’గా మరికొద్ది రోజుల్లో మాస్ మహరాజా రవితేజ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు జనాల్లో తిరిగిన విషయం అంటే.. స్టూవర్ట్‌పురం ప్రజలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు, అభ్యంతరాలే. నాగేశ్వరరావును యాంటీగా చూపిస్తున్నారు అంటూ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ ఊరు పేరును నెగిటివ్‌గా చూపిస్తున్నారని అని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ మాటలు తగ్గి, సినిమా ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్‌లుగా చేసిన రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఇటీవల సినిమా గురించి కొన్ని ఆస్తక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
దాంతోపాటు సినిమా కోసం రవితేజ పడ్డ కష్టాన్ని, ఒరిజినల్ నాగేశ్వరరావు గురించి చిన్నతనంలో తాము విన్న విషయాల గురించి కూడా వివరించారు. టైగర్ నాగేశ్వరరావు… సొంత ప్రాంతానికి దగ్గరలోనే రామ్‌లక్ష్మణ్ మాస్టర్‌లు సొంతూరు అనే విషయం తెలిసిందే. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు స్టువర్టుపురం ప్రాంతంలోనే పుట్టి పెరిగారు. టైగర్ నాగేశ్వరరావు గురించి చిన్నతనంలో ఊళ్లో కథలు కథలుగా విన్నారట. టైగర్ రన్నింగ్ ట్రైన్ ఈజీగా ఎక్కేసే వాడని, చెప్పి మరీ దొంగతనం చేసేవారని చిన్నతనంలో విన్నాం అని (Ram Lakshman) చెప్పారు.
అలాగే నాగేశ్వరరావు చెట్లపై కూడా పరిగెత్తే వారని అని చెప్పుకొచ్చారు. చెన్నై జైలు నుండి నాగేశ్వరరావు తప్పించుకున్నారు. అప్పుడే ఆయనకు టైగర్ అనే బిరుదు ఇచ్చారట. ఒరిజినల్ నాగేశ్వరరావుకు తగ్గట్టుగా రవితేజ ఈ సినిమాలో కష్టపడ్డారు. టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ చక్కగా సరిపోయారు. నాగేశ్వరరావు నివసించిన చీరాల ప్రాంతంలోని జీడి తోటల్లోనే ఈ సినిమా షూటింగ్ చేశాం.
రైలు యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా తెరకెక్కింది. వీటి కోసం రవితేజ చాలా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని సినిమాలో మీరే చూస్తారు అని చెప్పారు రామ్ లక్ష్మణ్. ఆ విషయం ఏంటో చూడాలంటే ఈ నెల 20వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా విజయ దశమి కానుకగా విడుదల చేస్తున్నారు.