చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పేవారు ఒక రకం.. అలా కాకుండా కాస్త చెప్పీ చెప్పనట్లు, అనీ అననట్లుగా చెప్పేవారు మరో రకం. ఇప్పుడు రకరకాల చర్చ ఎందుకు అనుకుంటున్నారా? నిన్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) ఈవెంట్‌లో రామ్ (Ram Pothineni) చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఈ చర్చ మొదలైంది. ముందు రామ్ ఏమన్నాడో చూద్దాం.. ఆ తర్వాత ఎందుకన్నాడో చూద్దాం. సోషల్ మీడియాలో, బయట ఈ మధ్య ఓ కొత్త ట్రెండ్ చూస్తున్నా. వాళ్లు, వీళ్లు అంటే పక్కవాళ్ల అభిప్రాయాల్ని విని ఓ నిర్ణయానికి వస్తుంటారు.
Ram Pothineni
మనకు నచ్చింది మనం చేయాలి. అంతే కానీ పక్కోడి గురించీ, పకోడీ గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అంటూ రామ్ అన్నాడు. నేను సలహాలు ఇవ్వను, అభిమానులంతా నా మనుషులే అనిపించి ఈ మాట చెప్పా అని కూడా అన్నాడు. ఇదంతా విన్నాక.. రామ్ ఎవరి గురించి అన్నాడు, ఎందుకు అన్నాడు అనే చర్చ మొదలైంది. ఇటీవల కాలంలో రామ్ విషయంలో ఏం జరిగింది? రామ్‌ను ఎవరేమన్నారు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
మరికొందరైతే ఏదో జనరల్‌గా అందరి గురించి అని ఉంటాడు అని అంటున్నారు. దీంతో ఈ విషయంలో రామ్ క్లారిటీ ఇస్తే బాగుండు అని మరికొందరు అంటున్నారు. అయితే, ఇక్కడో విషయం గుర్తుకు తెచ్చుకుంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా షూటింగ్ అగిపోయింది అనే టాక్ బయటకు వచ్చింది. సినిమా ఇక ముందుకెళ్లదు అని కూడా వార్తలొచ్చాయి.
సరిగ్గా అదే సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఖాళీగా ఉన్నప్పుడు చేసే వ్యాపకం ‘పూరి మ్యూజింగ్స్’ స్టార్ట్ చేశారు. దీంతో పుకార్లు నిజమే అనుకున్నారంతా. అయితే, అదేం లేదని.. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు అంటూ సినిమా టీమ్ నుండి వార్త బయటకు వచ్చింది. దీంతో అలా లేనిపోని పుకార్లు రావడం నచ్చక రామ్ ఇలా ఇప్పుడు ‘పక్కోడు.. పకోడీ’ మాటలు అన్నాడు అని మరికొంతమంది సీనియర్ నెటిజన్లు అంటున్నారు.