బటర్ ఫ్లై కిష్ గ్లింప్స్ వీడియోతో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా మీద ఆసక్తి కలిగించాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత పవన్ కల్యాణ్ లుక్స్, మేనరిజమ్స్ సిమిలర్‌గా చేస్తూ టీజర్‌తో అంచనాలు పెంచుకున్నాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం మళ్లీ పవన్ కల్యాణ్ దగ్గరకే వెళ్తున్నాడు. అదేనండీ ఆయన పుట్టిన రోజునే సినిమా విడుదల చేస్తున్నాడు. అయితే సినిమా గతంలో చాలాసార్లు వాయిదా పడింది. అదెందుకు అనేది తర్వాత చూద్దాం. అయితే .. ఇప్పుడెందుకు సినిమా వాయిదా వేస్తున్నారు అనేది చూద్దాం.
‘రంగ రంగ వైభవంగా’ సినిమాను గిరీశయ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అవుట్‌పుట్‌ను తన గురువు సందీప్ రెడ్డి వంగాకు చూపించారట. ఈ క్రమంలో ఆయన కొన్ని మార్పులు, చేర్పులు సూచించారట. వాటిని పూర్తి చేయడానికి ఓ నెలైనా పడుతుంది అనేది ఇన్‌సైడ్ వర్గాల మాట. దీంతో సినిమా విడుదలను సెప్టెంబరు 2కి వాయిదా వేశారు అని చెప్పారు. సందీప్ రెడ్డి వంగా దగ్గర ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు గిరీశయ శిష్యరికం చేసిన విషయం తెలిసిందే.
ఇక గతంలో వాయిదాల చిట్టా తీస్తే చాలానే ఉన్నాయి. నిజానికి సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. పెద్ద సినిమాల మధ్యలో ఎందుకని వాయిదాలు వేస్తూ వచ్చారు. అలా మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా మే 27న రిలీజ్ అనుకున్నారు. ఈ మేరకు ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అంతలోనే వాయిదా వేసుకొని జులై 1 ఫిక్స్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. జులై ఆఖరున లేదా ఆగస్ట్‌లో మొదట్లో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్ వినిపించింది.
కానీ మేకర్స్ ఏకంగా సెప్టెంబర్ 2 కొత్త రిలీజ్ అంటూ పోస్టర్ వదిలారు. దీంతో ఇన్ని రోజులా అనే నిట్టూర్పు మొదలైంది. టీజర్‌తో వచ్చిన హైప్ పోతుందేమో అనే భయం కూడా ఉంది. అయితే బెస్ట్ అవుట్ పుట్ కోసమే ఈ ఆలస్యం అని మరో మాట కూడా వినిపిస్తోంది.