సినిమాలు గురించి మాట్లాడేటప్పుడు, అందులోనూ మంచి (?) సినిమాల గురించి మాట్లాడేటప్పుడు.. ఎక్కువగా వినిపించే మాట ‘మన దగ్గర ఎక్కడ వస్తాయండి అలాంటి సినిమాలు.. ఏ తమిళమో, మలయాళమో చూడాలి’ అని అంటుంటారు కొందరు. అలాంటి వాళ్లను, మాటల్ని మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి వచ్చింది అనే విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దాంతోపాటు ఆ సినిమాను ఆదరించి, మరిన్ని అలాంటి సినిమాలు రావడానికి హోప్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.
ఓ సినిమా గురించి హైప్ ఇస్తున్నాం అనుకోకపోతే.. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వస్తున్న కమర్షియల్ సినిమాల హోరులో ఓ సినిమా కూల్‌గా వచ్చింది. అదే ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. ఉగాది సందర్భంగా 22న రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రచారం కోసం టీమ్ చాలా ప్రివ్యూలు వేసింది. దానికి చాలామంది యువ హీరోలు, ఔత్సాహికులు వచ్చారు. సినిమా చూశాక తమ అనుభూతుల్ని ట్విటర్ వేదిక, మాటల్లో చెప్పారు కూడా.
అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ప్రివ్యూ టాక్ మొదటి రోజు వరకే ఉండి, ఆ తర్వాత నుండి మౌత్ టాక్‌తోనే నడుస్తుంది. కమర్షియల్ సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు ఉపయోగం ఆ హీరోలు వచ్చి ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలకు ఇండస్ట్రీ ప్రచారం చేయాలి. జనాలు తమంతట తాము ముందుకు రాలి. అయితే కృష్ణవంశీ నుండి మంచి మంచి హిట్ సినిమాలు అందుకున్న స్టార్ హీరోలు, యువ హీరోలు ముఖం చాటేశారు అనిపిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు చాలామంది ఇదే పని.
ఆ హీరోలు ఎవరు అనేది ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. హీరోలందరికీ ఆయన హిట్లు ఇచ్చారు అని చెప్పలేం కానీ.. మంచి సినిమాలైతే ఇచ్చారు. వీరిలో చిరంజీవి లెక్క వేరు. ఎందుకంటే ఆయన సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి విష్ కూడా చేశారు. దీంతో మిగిలిన హీరోలే ఇప్పుడు ముందుకు రావాలి. లేదంటే జనాలైనా ముందుకొచ్చి సినిమా చూసి దీవించాలి. లేదంటే మన దగ్గర మంచి సినిమాలు రావు అనొద్దు. ఎందుకంటే వచ్చిన సినిమాను చూడకుండా అనేస్తాం అంటే కుదరదు కదా.