మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పూర్తి స్థాయి మాస్ పాత్రను పోషించిన రంగస్థలం.. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటనకు ఓ వైపు అభినందనలు.. మరో వైపు కనక వర్షం కురుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రంగస్థలం ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా అన్నిఏరియాల్లో హౌస్ ఫుల్ కలక్షన్స్ రాబడుతోంది. అత్యధిక వేగంగా వందకోట్ల (గ్రాస్) క్లబ్ లో చేరిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 1980ల కాలంలోని పల్లెటూరి నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై పదకొండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 151.29 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచి..
తాజాగా మరో మైలు రాయిని క్రాస్ చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని జోరు కొనసాగిస్తోంది. ఈ వారం రిలీజ్ అయిన నాని కృష్ణార్జున యుద్ధం పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రంగస్థలం చిత్రానికి అడ్డులేకపోయింది. మరో నాలుగురోజుల పాటు ఈ హవా కొనసాగుతుంది. ఏప్రిల్ 20 న మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా రిలీజ్ కానుండడంతో థియేటర్స్ తగ్గే ఆస్కారం ఉంది. అయినా కలక్షన్స్ పెంచుకోవడానికి రంగస్థలాన్ని అనువదిస్తున్నారు. హిందీ, తమిళం, మలయాళం, భోజ్ పురి భాషలో డబ్బింగ్ చేసి త్వరలో ఆయా రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడు సులువుగా రంగస్థలం 200 కోట్ల గ్రాస్ ని అధిగమిస్తుంది.