అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి. గ్రామాల్లో పాతికేళ్ళ క్రితం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టిన మూవీ రంగస్థలం. నాగ్ అశ్విన్ ఆశపడినట్టు కీర్తి సురేష్ సావిత్రిగా జీవించగా… సౌండ్ ఇంజినీర్ గా రామ్ చరణ్ నవరసనటన ప్రదర్శించారు. సుకుమార్ రాసుకున్న ప్రతి సన్నివేశాన్ని రంగస్థలంలోని నటీనటులు నటించారు. అందుకే రెండు సినిమాలో కొన్ని రోజుల తేడాలో వేసవి కానుకగా రిలీజ్ కాగా ఘనవిజయం సాధించాయి. రంగస్థలం 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మహానటి మూవీ బడ్జెట్ కి రెండింతల ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. దీంతో చిత్ర బృందాలు ఆనందంగా ఉండగా.. వారి ఆనందాన్ని రెట్టింపు చేసే సంఘటన జరిగింది. మెల్బోర్న్ లో ప్రతి ఏడాది ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ని నిర్వహిస్తుంటారు.
ఆ ఏడాది విడుదలయిన భారతీయ చిత్రాల్లో ఉత్తమైన వాటికీ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు సాగుతున్నారు. జ్యురీ మెంబర్స్ వివిధ కేటగిరీల్లో పలు చిత్రాలను, ఆర్టిస్టులను పరిశీలిస్తున్నారు. ఈ పోటీలో మహానటి, రంగస్థలం చిత్రాలు ఉత్తమ చిత్రాల కేటగిరీల్లో ఎంపిక అయ్యాయి. అదే విధంగా ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ సహాయనటిగా సమంతలు పోటీ పడుతున్నారు. ఇక ఈ వేడుకలో బియాండ్ బాలీవుడ్ కేటగిరీల్లో రంగస్థలం సినిమాని ప్రదేశించనున్నారు. ఈ వేడుకలో ప్రదర్శితమయ్యే తెలుగు సినిమా రంగస్థలం ఒక్కటే కావడం విశేషం. ఈ వార్త ఆ చిత్ర బృందాలతో పాటు తెలుగు సినీ అభిమానులను సంతోషపరిచింది.