ఓ యువ దర్శకుడికి సినిమాకు సినిమాకు మధ్య ఏడాది ఉండటమే ఎక్కువ అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఏడేళ్ల తర్వాత సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఆసక్తికరమే కదా. అలా అని ఇన్నేళ్లు ఖాళీగా ఉన్నారా అంటే అస్సలు లేదు. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు అయితే అది తొలి క్రాఫ్ట్‌లో. అదే సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా? యువ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని. టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా రవితేజ సినిమా విషయంలో ఓ వార్త వైరల్‌గా మారింది.
అదే కార్తిక్ ఘట్టమనేని అనే కుర్ర సినిమాటోగ్రాఫర్‌కి రవితేజ ఛాన్స్ ఇచ్చారని. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇస్తే ఆ కుర్ర సినిమాటోగ్రాఫర్ ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు అనొచ్చు. ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే సినిమాను కార్తిక్ 2015లో నిఖిల్ హీరోగా తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి స్పందనే వచ్చిందని చెప్పాలి. అయితే ఏమైందో ఏమో తర్వాత డైరక్షన్ ఆలోచన చేయలేదు కార్తిక్.
సినిమా ఫలితం నచ్చలేదో, లేక సరైన కథ తట్టలేదో కానీ ‘ప్రేమమ్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నిన్ను కోరి’, ‘రాధ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఆ!’, ‘చిత్రలహరి’, ‘డిస్కోరాజా’, ‘బ్లడీ మేరీ’ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘కార్తికేయ 2’, ‘ధమాకా’ సినిమాలు చేస్తున్నాడు. దీని తర్వాత కార్తికేయ మెగాఫోన్ పట్టబోతున్నారట. ఇటీవల రవితేజను కలసి కార్తికేయ ఓ కథ వినిపించారని, కాన్సెప్ట్ నచ్చడంతో రవితేజ ఓకే చెప్పాడని అంటున్నారు. త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉండొచ్చంటున్నారు.
ప్రస్తుతం రవితేజ చేతిలో ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాల తర్వాతే కార్తిక్ ఘట్టమనేని సినిమా ఉండొచ్చని టాక్. పైన చదువుకున్నట్లు ‘ధమాకా’ సినిమాలో కార్తిక్ పని చేస్తున్నాడు. అంతకుముందు ‘డిస్కోరాజా’ సినిమాకు కూడా చేశాడు. ఈ పరిచయంతోనే ఇప్పుడు సినిమా కథ చెప్పే అవకాశం వచ్చిందని అనుకోవచ్చు.