యావత్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినా.. హైద్రాబాద్ కు మాత్రం నైజాం సంస్థానం నుండి స్వతంత్రం రాని తరుణంలో చోటు చేసుకున్న సందర్భాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం”రాజాకర్” (Razakar) . 200 ఏళ్ల చరిత్ర కలిగిన నైజాం సంస్థను రజాకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం చేసింది అనేది చిత్ర కథాంశం. ట్రైలర్ తోనే చిన్నపాటి సంచలనం సృష్టించిన ఈ చిత్రం నేడు (మార్చి 15) థియేటర్లలో విడుదలైంది. మరి సినిమాగా “రజాకర్” ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. హైద్రాబాద్ ను పరిపాలిస్తున్న నైజాం సంస్థానం మాత్రం స్వతంత్ర భారతంలో కలవడానికి నిరాకరిస్తుంది. నైజాం ప్రజలు స్వాతంత్ర్యం కోసం తపిస్తుండగా.. రజాకర్ వ్యవస్థ మాత్రం వారిని హింసిస్తూ స్వాతంత్ర్య భావనను చంపేసి, హైద్రాబాద్ ను తుర్కిస్తాన్ గా మార్చడం కోసం పరితపిస్తుంటుంది.
రజాకర్ వ్యవస్థ, ప్రజలు మరియు భారత ప్రభుత్వం మధ్య జరిగిన ఈ ప్రచ్చన్న యుద్ధంలో ఎవరు గెలిచారు? అనేది “రజాకర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: ఈ సినిమా విషయంలో ఎక్కువగా ఆశ్చర్యపరిచేది క్యాస్టింగ్. తెలుగోళ్ల కంటే తమిళ, హిందీ క్యాస్టింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి చిన్న పాత్రలో సీనియర్ స్టార్ యాక్టర్ కనిపిస్తుంటాడు. గత కొంతకాలంగా కనిపించకుండాపోయిన తమిళ నటులందరూ ఒక్కసారిగా తెరపై కనిపించేసరికి ఆశ్చర్యపడడం ప్రేక్షకుల వంతవుతుంది.
లెక్కకుమిక్కిలి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తేజ్ సప్రు ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఇంద్రజ (Indraja), ప్రేమ (Prema) వంటి సీనియర్ హీరోయిన్లు చిన్నపాటి షాక్ ఇచ్చారు. అనసూయ (Anasuya) , మకరంద్ దేశ్ పాండే (Makrand Dehpande) , బాబీ సింహా (Bobby Simha) తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: క్యాస్టింగ్ అనంతరం సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని షాక్ కు గురి చేసే మరో అంశం పాటలు & నేపధ్య సంగీతం. సంగీత దర్శకుడిగా భీమ్స్ (Bheems Ceciroleo) “ధమాకా” (Dhamaka) అనంతరం తన సత్తాను చాటుకున్న సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో బీజీయమ్ వేరే లెవల్ లో ఉంది.
కుషేందర్ రెడ్డి (Kushendar Ramesh Reddy) సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. అయితే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేది. పేర్కొన్న ప్రదేశాలు వేరే అయినా.. సినిమా అంతా ఒకే సెట్ లో కానిచ్చేసినట్లుగా ఉంటుంది. అందువల్ల.. కొత్తదనం & సహజత్వం కొరవడుతుంది.
దర్శకుడు యాట సత్యనారాయణ (Yata Satyanarayana) ఒక చరిత్రలో మర్చిపోలేని ఓ దారుణమైన అంశాన్ని తీసుకొని వీలైనంత సహజంగా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. ఫస్టాఫ్ మొత్తం రజాకర్ లు చేస్తున్న అన్యాయాలను చూపించి కాస్త ఇబ్బందిపెట్టినా.. సెకండాఫ్ లో మాత్రం భారత ప్రభుత్వం హైద్రాబాద్ ను రక్షించడానికి చేసే ప్రయత్నాలను రోమాలు నిక్కబొడుచుకొనే స్థాయిలో తెరకెక్కించి విశేషమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువగా ఆకట్టుకున్నాడు.
సినిమాకి కథారూపం లోపించింది, అలాగే.. కథనం కూడా సరిగా ఉండదు. కేవలం కొన్ని సందర్భాలను సన్నివేశాలుగా విడదీసి సినిమాగా తెరకెక్కించినట్లుగా ఉంటుందే కానీ.. ఒక పూర్తిస్థాయి కథలా మాత్రం కనిపించదు. కానీ.. నైజాం వ్యవస్థ ఆగడాలను, అల్లర్లను, మతం ముసుగులో జరిగిన అన్యాయాలను నిక్కచ్చిగా తెరకెక్కించాడు.
విశ్లేషణ: కాస్తంత సహజత్వం లోపించిన మాట వాస్తవమే అయినప్పటికీ.. రజాకర్ వ్యవస్థ సృష్టించిన హింసను కుదిరినంత నిజాయితీగా తెరకెక్కించబడిన చిత్రం “రజాకర్”. ముస్లిం కమ్యూనిటీ నుండి కాస్తంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. చరిత్రపుటల్లో పేర్కొన్న హింసతో పోల్చితే చాలా నామమాత్రంగా చూపిన చిత్రం కావడం, రజాకర్ వ్యవస్థ కారణంగా హింసింపబడిన సమాజాలు, వ్యక్తులు ఇంకా తెలంగాణలో ఉండడం ఈ సినిమాను ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.