ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో అనవసర వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలో క్యాసినోలు పెట్టారనే ఆరోపణల ద్వారా వార్తల్లో నిలిచారు. కొడాలి నాని ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా టీడీపీ నేతలు కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ వివాదంతో వర్మకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా క్యాసినోపై మొదట టీడీపీ నేతలు సీనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నించాలంటూ వర్మ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాలోని గుడివాడ వెళ్లాను పాట వీడియో లింక్ ను షేర్ చేస్తూ తాను గుడివాడ క్యాసినో లైఫ్ గురించి కొడాలి నాని కాంటే ముందు జయమాలిని ద్వారా విన్నానని చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా యమగోల సినిమాలో ఆ పాటను అనుమతించారని ఆర్జీవీ పేర్కొన్నారు.
అందువల్ల తెలుగుదేశం పార్టీ నేతలు క్యాసినో గురించి కొడాలి నానిని ప్రశించడానికి ముందు సీనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నించాలని వర్మ చేసిన కామెంట్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేస్తున్న ట్వీట్లను చూసి ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఏపీ టికెట్ రేట్ల గురించి చేసిన కామెంట్ల వల్ల వర్మ వార్తల్లో నిలిచారు. టికెట్ రేట్ల గురించి వర్మ ఏపీ మంత్రి పేర్ని నానితో కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
అయితే ఆ సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఏపీలో త్వరలో టికెట్ రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నా టికెట్ రేట్లు ఎప్పటికి పెరుగుతాయో స్పష్టత రావడం లేదు. ఏపీలో టికెట్ రేట్లు పెరిగే వరకు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. త్వరలో సమస్యకు పరిష్కారం లభించాలని టాలీవుడ్ నిర్మాతలు కోరుకుంటున్నారు.