శాండిల్ వుడ్ నుండి స్టార్ హీరోలు చాలా మంది వచ్చారు, వస్తున్నారు కూడా. అయితే ఇప్పటితరం, నిన్నటితరం తెలుగు వారికి బాగా పరిచయమైన కన్నడ హీరోలు అంటే ఉపేంద్ర (Upendra Rao), సుదీప్ (Sudeep) .. ఇప్పుడు రిషభ్ శెట్టి (Rishab Shetty). డిఫరెంట్ సినిమాలు తీయడం, డిఫరెంట్ రోల్స్ చేయడం వాళ్లకు బాగా అలవాటు. అదే మనకు వారిని దగ్గర చేసింది. మరి ఉపేంద్ర, రిషభ్ శెట్టి మధ్య ఓ కామన్ పాయింట్ ఉందని మీకు తెలుసా? ఎందుకు తెలియదు శాండిల్ వుడ్ అని అనేయకండి.
ఎందుకంటే ఆ పాయింట్ ఆల్‌రెడీ పైనే చెప్పేశాం. ఇప్పుడు కొత్తగా తెలిసిన పాయింట్ ఏంటి అంటే.. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారట. అంటే ఉపేంద్ర, రిషభ్‌ది ఒకే ప్రాంతమట. దగ్గర దగ్గర ఉళ్ల నుండే ఇద్దరూ శాండిల్ వుడ్‌కి వచ్చారట. ఈ విషయాన్ని రిషభ్ శెట్టే ఇటీవల రానా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘రానా దగ్గుబాటి షో’ అంటూ డిఫరెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న రానా (Rana Daggubati) ఈ వారం రిషభ్ శెట్టిని (Rishab Shetty) వాళ్ల ఊరు వెళ్లి కలిశాడు. ఈ క్రమంలో ఉపేంద్ర గురించి చర్చ వచ్చింది.
మా తరం తెలుగువారికి శాండిల్ వుడ్ సినిమాలు పరిచయం చేసింది ఉపేంద్ర అని రానా అనగా.. ‘బాస్’ అంటూ రిషభ్ తన అభిమానాన్ని వెలిబుచ్చాడు. ఆ తర్వాత ఇద్దరికీ ఒకే ప్రాంతంమని.. కుందాపూర్‌కి దగ్గరలోనే ఉన్న కోట అనే ప్రాంతం నుండి ఆయన వచ్చారని చెప్పారు. రిషభ్‌ది కూడా కుందాపూర్ అనే విషయం తెలిసిందే. ఆ ప్రాంతం కథలనే ఆయన సినిమాలుగా చేస్తున్నారు. ఇదన్నమాట ఇద్దరి మధ్య కామన్ పాయింట్. ఇక తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే… రిషభ్ శెట్టి ఏమాత్రం తడుముకోకుండా సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. అలాగే ప్రతి తరంలోనూ ప్రతి ఇండస్ట్రీలో మంచి నటులు వచ్చారు అని అన్నారు.
ఉపేంద్ర ఇటీవల ‘యూఐ’ (UI The Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. రిషభ్ ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’, ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాలు వచ్చే ఏడాదే విడుదల అవుతాయి. ‘కాంతార: చాప్టర్ 1’కి ఆయనే హీరో, దర్శకుడు అనే విషయం తెలిసిందే.