దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది ‘ఆర్ఆర్ఆర్’. సోమవారం, మంగళవారం రోజులు కూడా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ హంగామా కనిపించింది. అయితే ‘బాహుబలి’ సినిమాకి ఉన్నట్లు రిపీట్ ఆడియన్స్ తో పోల్చుకుంటే ‘ఆర్ఆర్ఆర్’కి తక్కువే.
రాజమౌళి సినిమా అంటే బ్రాండ్ తో పటు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమాని చూస్తున్నారు. అయితే రిపీట్ ఆడియన్స్ కోసం త్రీడీ ఫార్మేట్ పై దృష్టి పెట్టింది చిత్రబృందం. ‘ఆర్ఆర్ఆర్’ని త్రీడీ ఫార్మేట్ లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రీడీ స్క్రీనింగ్ చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. హైదరాబాద్ మొత్తంలో ఒక్క థియేటర్ మాత్రమే బుక్ మై షో లాంటి యాప్స్ లో కనిపిస్తుంది.
ఈ వీకెండ్ నుంచి త్రీడీ స్క్రీన్స్ పెంచాలని నిర్ణయానికి వచ్చారు నిర్మాతలు. దేశవ్యాప్తంగా త్రీడీ స్క్రీన్లు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు శుక్రవారం నుంచి పెంచిన టికెట్ రేట్లను తగ్గించాలని డిస్టిబ్యూటర్స్ కి సమాచారమిచ్చారు. త్రీడీ స్క్రీన్ లు పెంచడం, టికెట్ల ధర తగ్గించడం వలన రెండో వారం కూడా కలెక్షన్స్ స్టడీగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అంతేకాదు.. శనివారం వీకెండ్ తో పాటు ఉగాది కూడా ఉంది.
ఈ పండగ కూడా ‘ఆర్ఆర్ఆర్’కి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఊపులో డిలీట్ చేసిన సీన్లను కూడా యాడ్ చేస్తే మరింత హైప్ రావడం ఖాయం. కానీ లెంగ్త్ మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి అలా చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. బహుశా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి!