పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే ఓ బ్యాంగ్ అనేలా వరుస సినిమాలు నిర్మిస్తూ వచ్చింది. అయితే కథల ఎంపిక విషయంలో.. బడ్జెట్, మొహమాటాల నియంత్రణ విషయంలో కొన్ని ఇబ్బందులు పడి కాస్త బ్యాక్‌స్టెప్ వేసేలా కనిపించింది. ఇప్పుడు ‘మిరాయ్’ సినిమా విజయంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరోసారి వరుస సినిమాలు ఓకే చేసేస్తున్నారు. చేతిలో ఉన్న 12 సినిమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమాను దాదాపు ఓకే చేసేశారని టాక్.
‘ప్రతి రోజూ పండగే’ అంటూ ఆరేళ్ల క్రితం వచ్చి చక్కటి విజయాన్ని అందుకున్నారు సాయితేజ్ – ప్రముఖ దర్శకుడు మారుతి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి మారుతి దర్శకుడిగా కాకుండా కథా రచయితగా ఉంటారు అని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సాయితేజ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. గతంలో ‘బ్రో’ సినిమా తర్వాత ఈ మేరకు ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పుడది కార్య రూపం దాల్చబోతోంది అని సమాచారం.
మారుతి అందిస్తున్న కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా దర్శకుడు వంశీకృష్ణ ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో సాయి తేజ్ హీరో కాగా.. డార్లింగ్ స్వామి మాటలు అందిస్తారట. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందట. త్వరలోనే సినిమాను నేరుగా పట్టాలెక్కించేస్తారని సమాచారం. అదేంటి ముహూర్తం ఉండదా అని అనుకుంటున్నారా? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లకు ఇలాంటి లాంఛనాలు ఏమీ లేవు. గతంలో కూడా చేయలేదు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ప్రస్తుతం 12 సినిమాలు సిద్ధమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ – రాశీ ఖన్నా – శ్రీనిధి శెట్టి – నీరజ జోన సినిమా ‘తెలుసు కదా’ అక్టోబరులో వస్తుంది. రోషన్ – సందీప్ రాజ్ ‘మోగ్లీ’ కూడా పదో నెలలోనే వస్తుందట. ఇక అడివి శేష్ – వామికా గబ్బి ‘జీ 2’, ఆనంది ‘గరివిడి లక్ష్మి’, లావణ్య త్రిపాఠి సినిమా, సునీల్ సినిమా కూడా ఉన్నాయి అని తెలిపారు. వీటన్నింటి కంటే అతి పెద్ద సినిమా ప్రభాస్ – మారుతి ‘ది రాజాసాబ్’. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేస్తారు.