ఎప్పుడు నెల రోజులు తర్వాత వచ్చే సినిమాలకు సింగిల్స్ రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నాయి సినిమా టీమ్‌లు. అలాంటి మరో పది రోజుల్లో రిలీజ్ ఉన్న సినిమాకు ఇంకా అలాంటి ప్రచారం జరగడం లేదేంటి. ఈ డౌట్ చదవగానే మీకు ఠక్కున గుర్తొచ్చే పేరు ‘సలార్’. ఎందుకంటే పది రోజుల్లో ఉన్న సినిమా అదే. ప్రచారం లేని సినిమా కూడా అదే కాబట్టి. అయితే ఇక్కడ ప్రశ్న ఎందుకు ప్రచారం చేయడం లేదు. అసలు చేస్తారా లేదా?
‘సలార్’ సినిమా (Salaar) ప్రచారం ఎందుకు చేయడం లేదు? అనే ప్రశ్నకు సమాధానం దొరికే ముందు అసలు సినిమా పనులు పూర్తయ్యాయా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ డబ్బింగ్ నిన్ననే పూర్తి చేశాడు. ఇంకా మరికొంతమంది డబ్బింగ్ పనులు ఉన్నాయి అంటున్నారు. ఆ లెక్కన చూస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు. ప్రచారం వేగం పెరగకపోవడానికి ఇదొక కారణం అంటున్నారు.
ఇక రెండో కారణం ప్రభాస్ అందుబాటులో లేకపోవడం. చాలా రోజులుగా ప్రభాస్ బయట ఎక్కడా కనిపించడం లేదు. విదేశాల్లో ఏదో సర్జరీ అయ్యిందని లీకులు తప్ప ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. ఆ కారణంగానో, ఇంకో కారణమో కానీ… ఆయన ప్రచారానికి వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. వరుస షెడ్యూళ్ల షూటింగ్ ఉండటం వల్ల అలా చేస్తున్నారని ఓ టాక్. అయితే అంత బిజీ షెడ్యూల్ ఉన్నా… ‘సలార్’ లాంటి పెద్ద సినిమాకు ప్రచారం లేకపోవడం సరికాదు అనే వాదనా వినిపిస్తోంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే… సినిమాలో ప్రభాస్ పాత్ర నిడివి. మూడు గంటల సినిమాలో ప్రభాస్ కనిపించేది తక్కువే అని ఓ పుకారు గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అందుకే ప్రభాస్ ప్రచారానికి ప్రశాంత్ ముందుకు రావడం లేదు అంటున్నారు. అయితే వీటిల్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది టీమే చెప్పాలి. ఆ విషయం పక్కనపెడితే సినిమాకు ప్రచారం లేకుండా బరిలోకి దిగడం ఓకేనా?